Telangana BJP: టార్గెట్ 11 వేల సభలు.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి స్టార్ట్!

Kaburulu

Kaburulu Desk

January 17, 2023 | 10:00 AM

Telangana BJP: టార్గెట్ 11 వేల సభలు.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి స్టార్ట్!

Telangana BJP: తెలంగాణ బీజేపీకి పార్టీ అధిష్టానం కొత్త టార్గెట్ ఫిక్స్ చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకొనే పనిలో ఉన్న బీజేపీ ఇందుకు తగ్గ అన్ని అవకాశాలను వినియోగించుకొనే పనిలో ఉంది. గతంలో పోలిస్తే బీజేపీ తెలంగాణలో పుంజుకుంది. అయితే.. అది అధికారం దక్కించుకునే స్థాయిలో ఉందా అంటే ఆ పార్టీ నుండి అవుననే సమాధానం రావడం కష్టమే. దానికోసమే అధిష్టానం మరింతగా ప్రజలలోకి వెళ్లేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటుంది.

ఇప్పటికే తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, ప్రజా గోస అంటూ పాదయాత్రలు కూడా చేస్తూ దూకుడు మీదున్న సంగతి తెలిసిందే. పనిలో పనిగా బీజేపీ నేతలకు అధిష్టానం మరో కీలక బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తుంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా నేతలంతా ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ఆదేశించిన పార్టీ అధిష్టానం.. ఊరువాడా అనే తేడా లేకుండా.. గ్రామగ్రామాన బీజేపీ నేతలు చొచ్చుకుపోవాలని సూచించినట్లు తెలుస్తుంది.

రాష్ట్ర స్థాయితో పాటు మెట్రో నగరాలు, పట్టణాలలో కొంతమేర బలమైన బీజేపీ నియోజకవర్గ స్థాయిలో బలపడలేదని అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తుంది. అందుకే గ్రామ, గ్రామానికి వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టడం కోసం పార్టీలోని నాయకులందరూ పనిచేయాలని సూచించింది. స్ట్రీట్ కార్నర్ మీటింగులు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల బలోపేతం వంటి వాటితో క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది.

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మొదలుపెట్టి ఏకంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించింది. అంతేకాదు 119 నియోజకవర్గాల తెలంగాణలో తొమ్మిది వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రతి 56 బూత్ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుందని పేర్కొంది. ప్రతి శక్తి కేంద్రానికి ఒక ప్రముఖ్ ను నియమించి మరీ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాలని నిర్ణయించింది.

మరోవైపు ఫిబ్రవరిలోనే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా వంటి అగ్ర నేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇక ఇదే సమయంలో నేతల కొరతను అధిగమించడం కోసం కూడా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల్లో ఉన్న బలమైన కీలక నేతలను పార్టీ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా రానున్న ఎన్నికల టార్గెట్ గా బీజేపీ పగడ్బంధీ ఎలక్షన్ మేనేజ్మెంట్ తో ముందుకెళ్తుంది. ఇక ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.