Taraka Ratna: విషమంగానే తారకరత్న పరిస్థితి.. బెంగళూరుకు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 10:13 AM

Taraka Ratna: విషమంగానే తారకరత్న పరిస్థితి.. బెంగళూరుకు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్

Taraka Ratna: టీడీపీ యువగళం పాదయాత్రలో పాల్గొని తీవ్ర గుండెపోటుకు గురై బెంగళూరులో నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. కుప్పం నుండి బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్న తారకరత్న ఆరోగ్యంపై ఇటు నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తారకరత్న ఆసుపత్రిలో చేర్చిన దగ్గర నుండి బాలకృష్ణ అక్కడే ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

తారకరత్న తల్లి, భార్య అలేఖ్యతో పాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఆసుపత్రి వద్దే ఉండగా.. శుక్రవారం రాత్రి నారా లోకేష్ ఆసుపత్రికి వెళ్లి వచ్చారు. శనివారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి చేరుకోగా.. తారకరత్న తండ్రి మోహన కృష్ణ, అత్త పురందేశ్వరి, సోదరి సుహాసినితో పాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు, పరిటాల శ్రీరామ్ కూడా బెంగళూరుకి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.

కాగా, తారకరత్నను చూసేందుకు ఆదివారం సోదరులు జూనియర్ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ కూడా బెంగళూరు వెళ్తున్నారు. వీళ్లిద్దరితోపాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రత్యేక విమానంలో వీరంతా బెంగుళూరు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయమై ఆందోళనకరంగా ఉన్న కారణంగా కుటుంబ సభ్యులంతా హృదయాలయకు చేరుకుంటున్నారు.

మయోకార్డియల్‌ ఇన్ఫెక్షన్‌ తర్వాత కార్డియోజెనిక్‌ షాక్‌ కారణంగా ఆయన పరిస్థితి క్లిష్టంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, పరిస్థితిని అంచనా వేస్తామని హృదయాలయ డాక్టర్లు చెప్తున్నారు. తారకరత్న ఆరోగ్యం విషమంగా ఉందనే వార్తలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తారకరత్న పూర్తి ఆరోగ్యాలతో తిరిగి బయటికి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.