Tamilanadu Rains: భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం.. 11 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌!

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 12:22 PM

Tamilanadu Rains: భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం.. 11 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌!

Tamilanadu Rains: తమిళనాడును భారీ వర్షాలు తలాకుతలం చేస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు జిల్లాలో అయితే ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇంతకు ముందు నాగపట్టణం, తిరువారూర్ జిల్లాలు సహా రాష్ట్రంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలుగా ఉన్నట్లు ఇక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్టణం, తరువారూర్‌ జిల్లాల్లో గురువారం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించగా నేడు మరికొన్ని జిల్లాలలో సెలవులు ప్రకటించారు.

మరోవైపు రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రానున్న రెండు మూడు రోజులలో కూడా ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, వాయువ్య భారతదేశంలో ఈ నెలలో సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. అయితే, రానున్న రోజుల్లో చలిగాలుల ప్రభావం తగ్గుతుందని పేర్కొంది.

మరోవైపు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా విచిత్ర వాతావరణం నెలకొంది. ఈస్టర్లీస్ గాలులతో మొదట వర్షాలు ప్రారంభమవగా.. చిరుజల్లులు కురిసి ఆగిపోతున్నాయి. తిరుపతి జిల్లాలో పలు భాగాల్లో ఈస్టర్లీస్ గాలుల ప్రభావంతో చిరు జల్లులు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మరో రెండు రోజులు ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.