Weather Report: ఉపరితల ఆవర్తనం.. ఏపీలో మళ్ళీ వర్షాలు!

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 11:32 AM

Weather Report: ఉపరితల ఆవర్తనం.. ఏపీలో మళ్ళీ వర్షాలు!

Weather Report: ఏపీలో ఒకపక్క ఇంకా చలి తీవ్రత కొనసాగుతుండగానే మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది. అల్పపీడన ప్రభావంతో ఈనెల 29, 30వ తేదీల్లో ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ క్రమంలో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఉపరితల ఆవర్తనంతో ఈ శనివారం అది అల్పపీడనంగా మారనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ఈ అల్పపీడనం మూడు రోజులపాటు నెమ్మదిగా కదులుతుందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 29, 30 తేదీల్లో ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాలలో మోసర్తు వర్షాలు కురవబోతున్నా యి.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. రానున్న 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని.. పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 31 నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, ఫిబ్రవరి 1వ తేదీ నాటికి శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందంటున్నారు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమిస్తాయి కనుక వర్షాలు పడవని.. చాలా అరుదుగా జరుగుతుందని చెబుతున్నారు.

సముద్రంపై తేమ ఎక్కువగా ఉండడంతో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. అయితే, ఇప్పుడు వర్షాలు పడితే కనుక అటు యాసంగి రైతులతో పాటు పత్తి, మిర్చి, పొగాకు రైతులు నష్టపోయే ఛాన్స్ ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేలికపాటి, మోస్తరు జల్లులు పడితే కనుక ఎవరికీ ఎలాంటి నష్టాలు ఉండవు. భారీ వర్షాలు కురిస్తే రైతులకు మళ్ళీ ఇబ్బందులు తప్పవు.