Singer Mangli: తెలుగు సినీ సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి.. అసలు ఏమైందంటే?

Kaburulu

Kaburulu Desk

January 22, 2023 | 05:52 PM

Singer Mangli: తెలుగు సినీ సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి.. అసలు ఏమైందంటే?

Singer Mangli: ప్రముఖ సినీ సింగర్ మంగ్లీ కారు‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన కర్ణాటకలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో తెలుగుతో పాటు ఇతర బాషలలో కూడా పాపులారిటీ దక్కించుకున్న మంగ్లీ.. ఇతర రాష్ట్రాలలో స్టేజ్ షోలకు కూడా హాజరవుతుంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి బళ్లారిలోని మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొంది.

ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్టేజ్‌ మీద పాటలు పాడటం ముగించుకుని.. అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే స్టేజ్ వెనక్కి వెళ్లగా.. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున యువకులు అక్కడికి చేరుకున్నారు. వేదిక వెనుకవైపు ఉన్న మేకప్ టెంట్‌లోకి కూడా యువకులు ప్రవేశించగా అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగింది.

ఈ క్రమంలోనే పోలీసులు యువకులపై లాఠీచార్జి చేయగా.. ఈ ఉద్రిక్తతల మధ్యే మంగ్లీ కారులో అక్కడి నుంచి బయలుదేరింది. అయితే, ఆమె కారులో బయలుదేరే సమయంలో స్థానిక యువకులు రాళ్లు విసిరారు. దీంతో మంగ్లీ ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. కొద్దిరోజుల క్రితం చిక్కబళ్లాపుర్లో జరిగిన ఓ కార్యక్రమంలో జరిగిన దానిని మనసులో పెట్టుకొని ఆకతాయిలు ఇలా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిక్కబళ్లాపుర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీని యాంకర్ అనుశ్రీవేదిక మీదకు పిలిచింది. అందరికీ నమస్కా రం అంటూ మంగ్లీ తెలుగులో మొదలు పెట్టగా.. ఇక్కడ కన్నడవారు ఉన్నారు.. కన్నడలో మాట్లాడండి.. అని అనుశ్రీ చెప్పింది. పక్కన అనంతపురం ఉంది.. అందరికీ తెలుగు వస్తుందని మంగ్లీ సమాధానమిచ్చినా ప్రేక్షకులు గోల ఆపలేదు. మొత్తానికి మంగ్లీ కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడింది.

ఆ తర్వాత కూడా అనుశ్రీ కన్నడలో ప్రశ్న అడిగేటప్పుడు తనకు అర్థం కావడం లేదని మంగ్లీ చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కన్నడ నెటిజన్లు దీనిపై తీవ్రంగా మండిపడుతూ కామెంట్లు పెట్టారు. కన్నడ ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా కన్నడ నేర్చుకోలేవా అంటూ కన్నడ సినీ అభిమానులు అప్పటి నుండి ఫైర్ అవుతూనే ఉన్నారు. ఈక్రమంలో ఈ రాళ్ల దాడి వెనక ఆ సంఘటన కూడా ఉందా అని అనుమానిస్తున్నారు.