Janasena: ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నాం.. పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 03:39 PM

Janasena: ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నాం.. పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Janasena: ఇప్పటికీ తాము బీజేపీతో పొత్తులోనే ఉన్నామని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెల్లడించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికలలో కూడా బీజేపీతో పొత్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. తన ఎన్నికల ప్రచారం రథం వారాహికి పూజా కార్యక్రమాల కోసం కొండగట్టుకు వచ్చిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ-జనసేన-బీజేపీల పొత్తుతో 2014 కాంబినేషన్ పై కాలమే సమాధానం చెబుతుందన్నారు.

ప్రస్తుతానికి బీజేపీతో కలసి ఉన్నామన్న జనసేనాని.. ఎవరు కలసి వస్తే వాళ్ళతో పొత్తుకు వెళ్తామని, ఒకవేళ ఎవరూ రాకపోయినా ఒంటరిగా అయినా ఎన్నికలకు వెళతామని తెలిపారు. అయితే, పొత్తులకు ఇంకా సమయం ఉందని, ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేవు కదా అని ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే రానున్న ఎన్నికల్లో పొత్తులపై జనసేన క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తుంది.

ముందు నుండీ చెప్పుకున్నట్లుగానే మొత్తం 3 ఆప్షన్లను పవన్ ప్రస్తావించారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నాం. మా పొత్తు ఇంకా కొనసాగుతుందని చెబుతూనే ఒకవేళ కాదంటే ఒంటరిగా వెళతామనే సంకేతం ఇచ్చారు. కొన్ని అంశాల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటందన్నారు. మరోవైపు కొత్తగా కలిసివస్తే పొత్తుకు వెళ్లేందుకు సిద్ధమేనని పరోక్షంగా టీడీపీతో పొత్తుపై వ్యాఖ్యలు చేశారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నంబర్ 1 పైనా పవన్ తీవ్ర విమర్శలు చేశారు. విపక్షాలను అణచివేయడానికే జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిందని విమర్శించారు.

ఇక తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ పాత్ర ఏంటనేది కాలమే చెప్పాలన్నారు పవన్‌ కల్యాణ్‌. ఇక్కడ ఎలా అనేది, తమ పరిమితి ఏంటనేది ప్రజలు నిర్ణయించాలన్నారు. తమ శక్తి మేరకు తెలంగాణలో గొంతును వినిపిస్తామన్న జనసేనాని.. తెలంగాణలో కొత్త వారు కలిసి వస్తే కొత్తగా ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. ఎవరూ రాకుంటే ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని కామెంట్ చేశారు.