Doctors Neglect: ఆరేళ్ళ క్రితం మహిళకి ఆపరేషన్.. కడుపులోనే కత్తెర మరచిన వైద్యులు!

Doctors Neglect: ఈమధ్య కాలంలో కొన్ని ఆసుపత్రులలో వైద్యం, ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఆస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. రకరకాల రోగాలతో ఆసుపత్రులకు వెళ్లే ప్రజలను కాపాడాల్సిన వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణపాయ పరిస్థితులకు గురిచేస్తున్నారు. అలాంటి సంఘటనే తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వెలుగులోకి వచ్చింది.
ఆరేళ్ళ క్రితం ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన మహిళా డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. దీంతో అప్పటి నుండి కత్తెర ఆ మహిళ పొట్టలోనే ఉండిపోయింది. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం ఆరేండ్ల కిందట గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వచ్చింది. ప్రసవ సమయంలో వైద్యురాలు కత్తెరను కడుపులోనే మరిచిపోయింది. ఇటీవల సదరు మహిళ కడుపు నొప్పితో బాధపడుతుంది.
తర్వాత ఆమెకు పలు మార్లు కడుపునొప్పి వచ్చినా.. సాధారణ నొప్పి అనుకుని మాత్రలు వేసుకుంది. అయినా తగ్గకపోవడంతో పలువురు వైద్యుల వద్దకు వెళ్లి చూపించుకుంది. అయినా పరిస్థితిలో ఏ మార్పు లేకపోవడంతో ఆ మహిళ హైదరాబాద్‌కు వెళ్లి స్కానింగ్ చేయించుకోగా కడుపులో కత్తెర ఉన్నట్టు బయటపడింది. దీంతో బాధితురాలు గోదావరిఖనికి వచ్చి వైద్యురాలిని నిలదీసింది.
కాళ్లబేరానికి వచ్చిన అప్పుడు ఆపరేషన్ చేసిన మహిళా డాక్టర్.. ఇప్పుడు మహిళ కడుపులో కత్తెరను తీసేందుకయ్యే ఖర్చు భరిస్తామని తెలపడంతో బాధిత కుటుంబం అంగీకరించినట్టు తెలిసింది. కాగా.. మహిళ కడుపులోని కత్తెరకు సంబంధించిన ఎక్స్‌రే చిత్రం ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది దానికి సంబంధించిన ఎక్స్‌రేనా కదా అన్నది తెలియడం లేదు.