YS Sharmila: నేడు గవర్నర్‌తో షర్మిల భేటీ.. నేటి నుండే పాదయాత్ర పునఃప్రారంభం

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 09:25 AM

YS Sharmila: నేడు గవర్నర్‌తో షర్మిల భేటీ.. నేటి నుండే పాదయాత్ర పునఃప్రారంభం

YS Sharmila: దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు మ‌ధ్యాహ్నం గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. షర్మిల తెలంగాణ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ తో స‌మావేశం అవుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు, వైఫల్యాలపై గ‌వ‌ర్న‌ర్ కు ష‌ర్మిల లేఖ అందిస్తారు.

గవర్నర్‌ భేటీ అనంతరం రాజ్ భవన్ నుంచే నేరుగా షర్మిల పాదయాత్రకు బయలు దేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. నర్సంపేట నియోజక వర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తాండా నుంచి పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టనున్నారు. షర్మిల పాదయాత్రకు వరంగల్ పోలీసులు
షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.

జనవరి 28 నుంచి పాదయాత్ర నిర్వహించేందుకు వైఎస్‌ఆర్‌టీపీ పోలీసుల అనుమతి కోరినప్పటికీ.. 2023 ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 18 వరకు పాదయాత్ర నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. షర్మిల యాత్రకు 15 షరతులు విధించారు పోలీసులు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభించి, సాయంత్రం 7 గంటలకు ముగించాలని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగిలిన అన్ని జిల్లాలలో షర్మిల పాదయాత్ర కొనసాగనుండగా.. ఖమ్మం జిల్లా పాలేరులో బహిరంగ సభతో పాదయాత్ర ముగించనున్నారు.

కాగా, గతంలో షర్మిలను అరెస్ట్‌ చేసిన తీరును గవర్నర్ తమిళిసై ఇప్పటికే తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో షర్మిల అరెస్టుపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారు లోపల ఉన్నప్పుడు, ట్రాఫిక్ పోలీసులు షర్మిల కారును దూరంగా లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయంటూ ట్వీట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల నేడు గవర్నర్ ను కలవడం.. ప్రభుత్వంపై లేఖ ఇవ్వడం ఆసక్తిగా మారింది.