Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. ఛార్జ్ షీట్‌లో ఢిల్లీ సీఎం, వైసీపీ ఎంపీ, కవిత పేర్లు

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 08:55 PM

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. ఛార్జ్ షీట్‌లో ఢిల్లీ సీఎం, వైసీపీ ఎంపీ, కవిత పేర్లు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలన మలుపు తీసుకుంది. ఈసారి కీలక వ్యక్తుల పేర్లు ఈడీ ప్రస్తావించింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌లో మొత్తం 17 మందిపై అభియోగాలు మోపింది.

రెండో ఛార్జి షీట్ లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్లు ఛార్జిషీట్ లో ఈడీ తెలిపింది. కవిత ఆదేశాలతోనే అరుణ్‌పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని ఈడీ స్పష్టం చేసింది. అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేసిన వారి లిస్టులోనూ ఆమె పేరును ప్రస్తావించింది. కవిత 10 ఫోన్లు మార్చినట్లు పేర్కొంది.

రెండో ఛార్జ్ షీట్ లో పేర్కొన్న వారిలో ఇంకా అభిషేక్ బోయిన్ పల్లి, అమిత్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, బినయ్ బాబులతో పాటు కావోగాలి రెస్టారెంట్, ట్రైడెంట్ లిమిటెడ్, పెరమండ్ రిసార్ట్, పాపులర్ స్పిరిట్, అవంతికా కాంట్రాక్టర్స్, కేఎస్ జయం స్పిరిట్, బడ్డీ రిటైల్స్, స్పిరిట్ డిస్ట్రిబ్యూషన్, ఆర్మో మిక్స్ ఎకో సిస్టమ్ ల పేర్లను కూడా ప్రస్తావించింది.

ఈ లిక్కర్ స్కామ్ నుండి నుంచి వచ్చిన డబ్బును ఆప్ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడారని ఈడీ పేర్కొంది. కాగా, ఈడీ ఛార్జ్ షీట్ లో తన పేరును ప్రస్తావించడంపై కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పని చేయడం లేదు. ప్రభుత్వాలను కూల్చడానికి ఈడీ పని చేస్తుందని ఆరోపించారు. ఈ ఛార్జ్ షీట్ మొత్తం ఒక కల్పితమని ఢిల్లీ సీఎం కొట్టిపడేశారు. అయితే, సాక్షాత్తు ఒక సీఎంను ఛార్జ్ షీట్ లో నమోదు చేయడంతో ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది.