Gitam University: గీతంలో ప్రభుత్వ భూమి స్వాధీనం.. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్!

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 01:39 PM

Gitam University: గీతంలో ప్రభుత్వ భూమి స్వాధీనం.. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్!

Gitam University: వైజాగ్ గీతం యూనివర్సిటీ పరిసరాలలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. యూనివర్శిటీలో ఉన్న ప్రభుత్వ భూముల్ని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గీతం వైద్య కళాశాల పరిసరాల్లో గతంలో గుర్తించిన ప్రభుత్వ భూమి చుట్టూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కంచె ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలో భవనాలను కూడా కూలుస్తారనే ప్రచారం జరగడం.. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ తో యూనివర్సిటీ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్ ఆధ్వర్యంలో గీతం విద్యా సంస్థలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ భూముల్ని అక్రమించారనే ఆరోపణలతో గతంలో వర్శిటీ ప్రహరీలను తొలగించగా.. ఇప్పుడు ఆ భూమికి రెవెన్యూ అధికారులు కంచె ఏర్పాటు చేశారు. అయితే.. వేకువ జామునే రెవెన్యూ అధికారులు మెడికల్ కాలేజీ గేట్ వద్దకు చేరుకోవడం.. పోలీసులు భారీగా యూనివర్సిటీని చుట్టముట్టడంతో టెన్షన్ వాతావరణం కనిపించింది.

మొత్తం 14 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా ఇప్పుడు 5.25 ఎకరాలకు కంచె వేశారు. పలుచోట్ల ప్రభుత్వ భూమి అని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ సమయంలో మీడియా సహా ఎవరినీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. మరోవైపు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు మరికొందరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు పెట్టి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి బయటి వారిని అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు.

గీతం వర్సిటీ వద్దకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతం ఛైర్మన్ భరత్ ను కలిసేందుకు వెళ్తున్నామని.. తమను వెళ్లనివ్వాలని కోరాడ రాజాబాబు తదితరులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయినా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. అర్ధరాత్రి సమయంలో కంచె వేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు.