Seediri Appalaraju: పవన్ వెర్రిబాగులోడు, నాదెండ్ల పనికిమాలినోడు..!

Kaburulu

Kaburulu Desk

January 11, 2023 | 08:49 AM

Seediri Appalaraju: పవన్ వెర్రిబాగులోడు, నాదెండ్ల పనికిమాలినోడు..!

Seediri Appalaraju: పవన్ కళ్యాణ్ ఒక వెర్రిబాగులోడు.. నాదెండ్ల మనోహర్ ఒక పనికిమాలినోడు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు తిట్టిపోశారు. మత్స్యకారుల సమస్యల గురించి పవన్ కళ్యాణ్ కు, నాదెండ్ల మనోహర్ కు ఏమి తెలుసు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకారులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ ను నమ్మొద్దంటూ ప్రచారం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో చేశామని ప్రచారం చేస్తున్నారు.

అయితే.. ఒక్కసారిగా మత్స్యకారుల చుట్టూ ఈ రాజకీయం ఏంటి అనుకుంటున్నారా?. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల టార్గెట్ గా ఉత్తరాంధ్రలో మత్స్యకారుల ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకోవడానికి, మత్స్యకారులను ఆకర్షించడానికి వ్యూహాలను రచిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం యువజన దినోత్సవం సందర్భంగా సిక్కోలు జిల్లాలో యువశక్తి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు.

ఈ యువశక్తి కార్యక్రమానికి స్థానిక మత్స్యకార యువత భారీ ఎత్తున హాజరయ్యేలా నాదెండ్ల మనోహర్ గత నెల నుండి అక్కడే ఉండి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన నేతలకు బాధ్యతలు కట్టబెట్టిన నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని సూచించారు. అయితే, జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని.. దాన్ని మత్స్యకార కుటుంబాలు నమ్మవద్దని వైసీపీ కౌంటర్ ప్రచారం మొదలు పెట్టింది. ఇందు కోసం మంత్రి సీదిరి అప్పలరాజు రంగంలోకి దిగారు.

మత్స్యకారులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పర్యటిస్తున్న వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ ను నమ్మొద్దంటూ ప్రచారం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ఒక వెర్రిబాగులోడు, నాదెండ్ల మనోహర్ ఒక పనికిమాలినోడు అంటే తిట్టిపోస్తున్నారు. ఇలా, మొత్తంగా చూస్తే ఉత్తరాంధ్రలో మత్స్యకారుల ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తూ ఇటు జనసేన, జనసేన ను టార్గెట్ చేస్తూ అటు వైసిపి పోరు సాగుతుంది.