Liquor Sale: సంక్రాంతి లిక్కర్ కిక్.. అయ్యా బాబోయ్ ఎంత తాగేశారో!

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 09:08 AM

Liquor Sale: సంక్రాంతి లిక్కర్ కిక్.. అయ్యా బాబోయ్ ఎంత తాగేశారో!

Liquor Sale: ప్రజలను పాలించేది ప్రభుత్వమైతే.. ఆ ప్రభుత్వాలను నడిపించేది మద్యం. ఔను మన దేశంలో ఇప్పుడు మద్యంపై వచ్చే ఆదాయం మరే ఇతర దానిలో రాదంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు మందు బాబులు మత్తుగా ప్రభుత్వ ఖజానాలను నింపేస్తున్నారు. ఈ మధ్యనే నూతన సంవత్సర వేడుకల పుణ్యమా అని మన తెలుగు రాష్ట్రాలలో కూడా రికార్డ్ స్థాయి మద్యం వ్యాపారం జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో మద్యం వ్యాపారం కూడా ప్రభుత్వమే నడిపిస్తుండడంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం దక్కింది.

కాగా, ఇప్పుడు సంక్రాంతి పండుగ పుణ్యమా అని రాష్ట్ర ఖజానాకు మళ్ళీ పన్ను వరద పోటెత్తింది. పండుగ సందర్భంగా రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. గత మూడు రోజుల్లో రూ.213 కోట్ల మేర మద్యం అమ్ముడుపోయింది. అసలే పండగ ఆపైన వారాంతం కావడంతో మద్యం విపరీతంగా అమ్ముడు పోతుంది. పండుగను మరింత కిక్కు వచ్చేలా చేయడం కోసం మందుబాబులు మద్యం దుకాణాలపై దండయాత్ర చేశారు.

సంక్రాంతి రోజుకే ఏపీలో 2.33 లక్షలకు పైగా లిక్కర్ కేసులు, 83 వేలకు పైగా బీర్ కేసులను తాగేశారు. అత్యధికంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 27.81 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలున్నాయి. ముఖ్యంగా.. కోడి పందాల శిబిరాల్లోకి మద్యం బాటిళ్లు భారీగా తరలించారని సమాచారం. ఈ జిల్లాలకు తెలంగాణ నుంచి కూడా మద్యం భారీగా డంప్ అవుతోందని తెలిసింది.

సంక్రాంతి సందర్భంగా ఇతర ప్రాంతాల్లో ఉండే ఏపీ వాసులంతా రాష్ట్రానికి తిరిగి రావడం.. పండగను మరింత సెలబ్రేట్ చేసుకొనేలా మద్యాన్ని అత్యధికంగా సేవించారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాకి భారీగా ఆదాయం వచ్చిపడింది. అయితే.. అటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుండి కూడా ఏపీకి భారీగా మద్యం డంపింగ్ అయిందని తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ స్థాయి మద్యం అమ్మకాలు జరగగా పండగ చివరి రోజైన కనుమ రోజున ఈ అమ్మకాలు ఇక ఏ స్థాయిలో ఉండనున్నాయో చూడాల్సి ఉంది.