Viveka Case: బాబాయ్ చనిపోతే జగన్‌కు ఫోన్ చేయడం కూడా తప్పేనా?.. అవినాష్ కాల్ లిస్టుపై సజ్జల

Kaburulu

Kaburulu Desk

February 3, 2023 | 11:24 PM

Viveka Case: బాబాయ్ చనిపోతే జగన్‌కు ఫోన్ చేయడం కూడా తప్పేనా?.. అవినాష్ కాల్ లిస్టుపై సజ్జల

Viveka Case: మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందా రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలకి ముందు జరిగిన ఈ హత్య అప్పటి ఎన్నికలను కూడా ప్రభావితం చేసింది. అయితే.. అప్పటి నుండి ఎన్నో మలుపులు తిరిగిన ఈ హత్య కేసులో ఇప్పుడు సీబీఐ దూకుడు ప్రదర్శిస్తుంది. వివేకా కూతురు సునీతా అభ్యర్ధన మేరకు ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయగా.. తర్వాత దర్యాప్తులో సీబీఐ.. ఎంపీ అవినాష్ కు ఒకటికి రెండుసార్లు నోటీసులివ్వడం.. ఆయన హాజరవ్వడంతో కేసు తీవ్ర ఉత్కంఠగా మారింది.

అయితే.. అవినాష్ దర్యాప్తులో ఆయన కాల్ లిస్ట్ లో ఉన్న పేర్లతో పాటు మరికొందరి పేర్లు ఈ కేసులో బయటకిరావడం ఆసక్తి మారింది. అందులో ముఖ్యంగా సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, వైఎస్ భారతికి ఇంట్లో పనిచేసే నవీన్ పేర్లు బయటపడ్డాయి. ఇందులో ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నాయి. అదలా ఉండగానే ఈ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి కమ్యూనికేట్ చేయడం కోసమే నవీన్ ఫోన్ చేశారని, సీఎం జగన్ కు ఫోన్ లేకనే వాళ్ళకి ఫోన్ చేశారని.. ఇందులో తప్పేముందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వివేకా చనిపోయిన విషయాన్ని ఆయన బావమరిదే అవినాష్‌ రెడ్డికి చెప్పారన్న సజ్జల.. చంద్రబాబు నాయుడు, రామోజీరావు లాంటి వారికి ఫోన్ చేయాలంటే పక్కన ఉన్నవారికే ఫోన్ చేయాలి కదా? అని సజ్జల ప్రశ్నించారు.

వ్యవస్థలను ప్రభావితం చేయడం చంద్రబాబుకు, ఆయన కింద పని చేసే వారికి వెన్నతో పెట్టిన విద్యనే అన్న సజ్జల.. సొంత బాబాయ్ చనిపోతే, జగన్‌కు ఫోన్ చేసి చెప్పడం కూడా తప్పేనా? అని ప్రశ్నించారు. సీబీఐ వాళ్లు నవీన్‌కు నోటీసులిస్తే, నవీన్ ఎవరో అంటూ ఇష్టం వచ్చినట్లు ఏదేదో ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల.. కృష్ణ మోహన్ రెడ్డి, నవీన్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు జగన్ వద్దే ఉన్నారని చెప్పారు.