AP MLC Elections: ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవం చేయడం కోసం అధికార పార్టీ నానా తిప్పలు!

Kaburulu

Kaburulu Desk

February 26, 2023 | 01:46 PM

AP MLC Elections: ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవం చేయడం కోసం అధికార పార్టీ నానా తిప్పలు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం అధికార పార్టీ వైసీపీ నానా తిప్పలు పడుతుంది. ఒకరికి ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం పెద్దఎత్తున సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం చేయడం కోసం అధికార పార్టీ తెగ ఆయాస పడుతుంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ మేరకు రంగంలోకి దిగారు.

శనివారం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలతో సమావేశమైన మంత్రులు.. వైసీపీ సమన్వయకర్తలు, కడప జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, మాజీ మంత్రి రాంసుబ్బారెడ్డితో సమావేశమయ్యారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ బరిలో దిగగా.. ఏపీ సర్పంచుల సంఘ రాష్ట్ర కార్యదర్శి భూమా వెంకటవేణుగోపాల్‌రెడ్డి టీడీపీ సహకారంతో బరిలో ఉన్నారు. ఇక జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు నర్ల మోహన్‌రెడ్డిలు స్వతంత్రులుగా నామినేషన్‌ వేశారు.

ఇందులో కె.శ్రీనివాసులును ప్రతిపాదిస్తూ బేతంచర్లకు చెందిన ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లు సంతకాలు చేయగా.. వారిని అర్థరాత్రి బలవంతంగా తీసుకెళ్లి.. తమ సంతకాలు ఫోర్జరీ చేశారని రిటర్నింగ్‌ అధికారి జేసీ రామ్‌సుందర్‌రెడ్డికి ఫిర్యాదు చేయించడంతో కె.శ్రీనివాసులు నామినేషన్‌ను పరిశీలనలోనే తిరష్కరించారు. కేసు కూడా నమోదు చేస్తామని ప్రకటించారు. అయితే, టీడీపీ నేతలు ముందు మద్దతు ఇచ్చి తర్వాత ఫోర్జరీ చేయించారనడంపై అనుచరులు మండిపడుతున్నారు.

ఇక, మిగిలిన వారిలో భూమా వేణుగోపాల్‌రెడ్డి, నర్ల మోహన్‌రెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లారు. అయితే, విత్‌డ్రాకు 27వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండడంతో అధికార పార్టీ నేతలు ఏకగ్రీవం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా నేతలంతా అదే పనిలో ఉన్నారు. ఇద్దరు మంత్రులు ఇక్కడే తిష్టవేసి ఈ ఎమ్మెల్సీని ఏకగ్రీవం చేసే పనిలో ఉన్నారు. ఇలాగైతే కష్టమేనని వైసీపీ నాయకులు కలిసి మెలిసి ముందుకెళ్లాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.