Punjab: 88 ఏళ్ల వృద్ధుడికి రూ.5 కోట్ల లాటరీ.. పండగ చేసుకో తాత!

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 05:02 PM

Punjab: 88 ఏళ్ల వృద్ధుడికి రూ.5 కోట్ల లాటరీ.. పండగ చేసుకో తాత!

Punjab: లక్ అనే పదం అప్పుడప్పుడూ మనం వింటూ ఉంటాం. అయితే.. ఆ పదానికే డెఫినిషన్ అనిపించాడు ఓ వృద్ధుడు. 35 ఏళ్లకు పైగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసిన 88 ఏళ్ల వృద్ధుడి అదృష్టం తిరిగి పంజాబ్‌లో లాటరీలో రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. పంజాబ్‌కు చెందిన దేరాబస్సీకి చెందిన మహంత్ ద్వారకా దాస్ గత 35-40 సంవత్సరాలుగా లాటరీలు కొనుగోలు చేస్తూ చివరకు లాటరీలో గెలిచాడు. లోహ్రీ మకర సంక్రాంతి బంపర్ లాటరీ 2023లో మహంత్ మొదటి బహుమతిని గెలుచుకున్నాడు.

లాటరీలో 5 కోట్ల రూపాయలు గెలుచుకున్న తర్వాత మహంత్ మాట్లాడుతూ.. తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఆ ప్రైజ్ మనీని తన ఇద్దరు కుమారులు.. తన ‘డేరా’కి పంచుతానని చెప్పాడు. నేను సంతోషంగా ఉన్నాను. నేను గత 35-40 సంవత్సరాలుగా లాటరీలు కొంటున్నాను. ఇప్పుడు ఇలా అదృష్టం వరించింది అన్నారు. మహంత్ కుమారుడు నరేందర్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. లాటరీ టికెట్ కొనడానికి తన తండ్రి తన మనవడికి డబ్బు ఇచ్చాడని.. అతను టికెట్ తేవడంతో తన తండ్రి గెలిచాడని చెప్పాడు. అతను గెలిచినందుకు మేము సంతోషిస్తున్నామని చెప్పారు.

మహంత్‌ ద్వారకా దాస్‌ తనకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1947లో తన కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చాడు. అప్పటి నుంచి పంజాబ్‌లో ఉంటున్నాడు. నాలుగు దశాబ్దాలుగా ఎక్కడ లాటరీ టికెట్లు కనిపించినా కొనడం.. లాటరీ కోసం ఎదురుచూడడం చేసేవారట. ఒక్కోసారి అసలు ఆ లాటరీ ఎక్కడ డ్రా తీస్తారో కూడా తెలియకుండానే టికెట్లు కోనేసేవారట. మొత్తంగా ఇప్పుడు ఇలా 88 ఏళ్ల వయసులో లాటరీలో గెలుపొందాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వృద్ధుడికి శుభాకాంక్షలు చెప్తున్నారు. మరికొందరైతే ఇప్పటికైనా అనుకున్నది సాధించావ్.. ఇక పండగ చేస్కో తాతా అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.