Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ.. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్.. నిలబెట్టుకోకపోతే..

Kaburulu

Kaburulu Desk

February 3, 2023 | 10:51 PM

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ.. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్.. నిలబెట్టుకోకపోతే..

Revanth Reddy: తెలంగాణలో ఇప్పుడు చావో రేవో అన్న పరిస్థితి. ఒకపక్క బీఆర్ఎస్ అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే.. ఎలాగైనా జెండా పాతాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డెందుకు సిద్ధమైంది. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్రం తెచ్చిన పార్టీగా ఏమైనా మళ్ళీ పుంజుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఎవరికి వారు రకరకాల యత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసినట్లుగా కనిపిస్తుంది.

ఈ లేఖలో ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు, బడ్జెట్‌ లో నిధుల కేటాయింపుపై ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని తప్పుబట్టారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల హామీ ఏమైంది? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ పై కేసీఆర్‌ నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కేసీఆర్‌కు ఇదే చివరి ఛాన్స్‌ అని, హామీలు నెరవేర్చకపోతే కేసీఆర్‌కు ఓట్లు అడిగే హక్కు లేదని రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.

గడిచిన నాలుగేళ్లలో రెండు విడతల్లో కలిపి మొత్తం మీద మాఫీ చేసింది కేవలం రూ.3,881 కోట్లు మాత్రమేనని.. ఇంకా రూ.20,857 కోట్లు మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. దళిత సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేశారన్న రేవంత్ రెడ్డి.. తొలి దళిత ముఖ్యమంత్రి మొదలు, ప్రతీ కుటుంబానికి మూడెకరాల భూమి వరకు ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చలేదని లేఖలో ఎత్తి చూపారు. ప్రస్తుతం దళితబంధు పేరుతో ఆ వర్గాలను మరోసారి వంచించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. పథకం అమలు తీరు చూస్తే ఊరికో కోడి.. ఇంటికో ఈక అన్నట్లు తయారైందని ఎద్దేవా చేశారు.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చినట్లు కనిపిస్తోందని.. సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్న హామీ ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3016 నిరుద్యోగ భృతి ఏమైందంటూ నిలదీశారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామన్న హామీ ఒక బూటకమని.. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలతో రైతులు రోడ్డెక్కుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వైద్యం విషయంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? కొత్త వాటి సంగతి ఏంటని ప్రశ్నించారు.