TS Congress: రేవంత్-కోమటి రెడ్డి గుసగుస.. అలిగిన వీహెచ్.. వీళ్ళు ఇక మారరా?

Kaburulu

Kaburulu Desk

January 21, 2023 | 09:05 AM

TS Congress: రేవంత్-కోమటి రెడ్డి గుసగుస.. అలిగిన వీహెచ్.. వీళ్ళు ఇక మారరా?

TS Congress: గాంధీభవన్లో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ ఠాక్రే ‘హాథ్ సే హాథ్’ కార్యక్రమంపై పార్టీ నేతలతో చర్చించేందుకు శుక్రవారం గాంధీ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రేను కలిసేందుకు వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి .. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాసేపు వీరిద్దరూ చర్చించుకోవడం
కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపింది.

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఆయన కాంగ్రెస్ లో కనిపించడం ఇదే. కాంగ్రెస్ తో, కాంగ్రెస్ నాయకులతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సర్దుకుపోలేరు అనుకున్న స్థితిలో ఆయనే నేరుగా గాంధీ భవన్ కి రావడం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జితో చర్చించడం.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చేతులు కలపడంతో ఈరోజు గాంధీ భవన్ సందడిగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడితో కోమటిరెడ్డికి పొసగదని అనుకుంటున్న సమయంలో ఇలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కోమటిరెడ్డి రాకతో ఇకపై పార్టీ కార్యక్రమాలు హుషారుగా కొనసాగుతాయని అనుకుంటుండగా సీనియర్ నేత వీహెచ్ అలిగి వెళ్లిపోవడం మరోసారి కలకలం రేగింది. మీటింగ్ నేపథ్యంలో గాంధీ భవన్‌కు సీనియర్ నేతలు వీహెచ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ సహా పలువురు హాజరయ్యారు. ఇదే సమయంలో వీహెచ్‌కు మహేశ్ గౌడ్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీనియర్ నేత వీహెచ్‌పై మహేశ్ గౌడ్ సీరియస్ కావటంతో.. కోపం వచ్చిన వీహెచ్ అలిగి గాంధీ భవన్‌ నుంచి తిరిగి వెళ్లిపోయారు.

‘ఇక్కడ అందరూ లీడర్లే.. పీసీసీ ప్రెసిడెంట్ ఏం మాట్లాడట్లేదు.. మహేశ్ గౌడ్ మాత్రం మాట్లాడుతుండు. ఆయన పిలిస్తేనే వచ్చారు అంటున్నాడు.. ఛల్..’ అంటూ వీహెచ్ కోపంతో వెళ్లిపోయారు. గాంధీభవన్ వేదికగా మరోసారి సీనియర్ల నేతల విభేదాలు.. కొత్త ఇంఛార్జ్‌ మాణిక్ రావు ఠాక్రే ముందే రచ్చ ఏర్పడడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అలిగిన వాళ్ళని ఎలాగోలా రాబడుతుంటే.. మరోపక్క మరొకరు అలిగి వెళ్లడంపై పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వీళ్ళు ఇక మారారా అంటూ తలలు పట్టుకుంటున్నారు.