Remote Voting System: రిమోట్ ఓటింగ్ సిస్టం.. ఈసీను తప్పుబట్టిన టీడీపీ నేత

Remote Voting System: ఉపాధికోసం, పనులకోసం వేరే ప్రాంతాలకు వెళ్లినవారు ఓటరు గుర్తింపుని మాత్రం సొంత ఊరినుంచి బదిలి చేసుకోరు. సొంత ఊరిలో ఓటు ఉంటే స్థానిక గుర్తింపుగా వారు భావిస్తారు. అదే సమయంలో పోలింగ్ వేళ వారికి సొంత ఊరికి వచ్చే అవకాశం కొన్నిసార్లు ఉండకపోవచ్చు. దీనివల్ల భారత్ లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి వారికోసం సొంత నియోజకవర్గంలో జరిగే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఇస్తోంది రిమోట్ ఈవీఎం.
ఓటర్లు దేశంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా రిమోట్ ఓటింగ్ మెషీన్ (RVM) విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఢిల్లీలో దీనిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం కూడా జరిగగా.. దీనిపై మరోసారి చర్చ జరగాలని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. సోమవారం జాతీయ, ప్రాంతీయ పార్టీలతో భేటీ అయిన ఈసీ.. ఆర్‌వీఎం పనితీరును రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రదర్శించింది.
ఇంటి వద్ద కాకుండా దూరంగా ఉండేవారు ఓటు హక్కు వినియోగించునేలా సిద్ధం చేసిన ఈ వ్యవస్థ డెమోకు 8 గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ పార్టీలను ఎన్నికల కమిషన్ పిలిచింది. అయితే, ఈ వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నాలను కాంగ్రెస్‌తో పాటు 16 ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. దీనిపై మరోసారి చర్చ జరగాలని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి.
అయితే, ఈసీ ఆలోచనను సూత్రప్రాయంగా స్వాగతిస్తున్నామన్న తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్.. ఎన్నికల సంఘం అనుసరించిన విధానాన్ని తప్పుబడుతున్నామన్నారు. ముందుగా రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే ఆర్వీఎం ప్రతిపాదనను తీసుకొచ్చారని ఆరోపించారు. విస్తృత సంప్రదింపులు, ఏకాభిప్రాయం తర్వాతనే ఈ విధానాన్ని అమలు చేయాలన్నారు.
ఈ రిమోట్ ఓటింగ్ మెషీన్ పై శాస్త్రీయ అధ్యయనం జరగాల్సి ఉందన్న పయ్యావుల అభిప్రాయాలు చెప్పడం కోసం పెట్టిన జనవరి 31 డెడ్‍లైన్ కూడా పొడిగించాలని చెప్పారు. ఏ ఒక్క ఓటరు కూడా ఓటువేసే అవకాశం కోల్పోకూడదన్నదే తమ విధానమని ఈసీ చెబుతోందని.. ఆ విధానానికి మేము కూడా అనుకూలమే అయినప్పటికీ అనేక సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.