President Security: రాష్ట్రపతి పాదాలు తాకేందుకు ప్రయత్నించిన అధికారినిపై సస్పెన్షన్ వేటు

Kaburulu

Kaburulu Desk

January 14, 2023 | 09:04 PM

President Security: రాష్ట్రపతి పాదాలు తాకేందుకు ప్రయత్నించిన అధికారినిపై సస్పెన్షన్ వేటు

President Security: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాదాలు తాకేందుకు ప్రయత్నించిన అధికారినిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిని చేసిన పనికి కేంద్ర హోంశాఖ కఠినంగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిని పనిని తప్పుబట్టడంతో హోంశాఖ అధికారినిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళా ఇంజినీర్ రాష్ట్రపతి ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించడాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రాజస్థాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము భద్రతను పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఒక జూనియర్ మహిళా ఇంజినీర్ ఉల్లంఘించి ఆమె పాదాలను తాకేందుకు ప్రయత్నించగా వారం తర్వాత ఆమెను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జనవరి 3, 4 తేదీల్లో రాజస్థాన్ లో పర్యటించారు. అందులో భాగంగా రోహెత్ లోని స్కౌట్ గైడ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆ సమయంలో ప్రజారోగ్య విభాగంలో ఇంజినీర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అంబా సియోల్.. సభా ప్రాంగణంలో నీళ్లను అందించే బాధ్యతలు చూస్తున్నారు. రాష్ట్రపతి ఆ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో స్వాగతం పలికేందుకు అధికారులు వేచిచూస్తున్నారు. అయితే, రాష్ట్రపతి చేరుకోగానే.. ప్రొటోకాల్ ఉల్లంఘించి అడుగు ముందుకేసిన ఆ అధికారిని రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించారు.

అయితే, రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకోగా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి నివేదికను కోరింది. స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. దీనిపై సీరియస్ గా స్పందించిన రాజస్థాన్ ప్రభుత్వం రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ నియమనిబంధనల ప్రకారం మహిళా ఇంజనీర్ ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్రపతి లాంటి ప్రముఖుల పర్యటనలో ప్రతిదీ పగడ్బంధీగా ఉంటాయి. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా ఎంతటి అధికారులపైనా అయినా చర్యలు తప్పవు అనేదానికి ఈ ఇంజనీర్ సెస్పెన్షన్ ఒక ఉదాహరణగా చూడాలి.