TS Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు.. బీఆర్‌‌ఎస్‌‌పై రేవంత్ పోలీస్ కంప్లైంట్?

Kaburulu

Kaburulu Desk

January 6, 2023 | 01:11 PM

TS Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు.. బీఆర్‌‌ఎస్‌‌పై రేవంత్ పోలీస్ కంప్లైంట్?

TS Telangana: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. ఫామ్ హౌస్ లో బేరసారాలు.. సీసీ టీవీ ఫుటేజ్ విడుదల.. ఆ తర్వాత బీజేపీపై టీఆర్ఎస్ నేతల ఆరోపణలు, విమర్శలు.. టీఆర్ఎస్ కుట్ర చేసిందంటూ బీజేపీ ఆరోపణలు.. ఫామ్ హౌస్ లో బీజేపీ రిప్రెజెంట్స్ గా వెళ్లిన వాళ్లెవరో కూడా తమకి తెలియదని.. టీఆర్ఎస్ బద్నామ్ చేసేందుకు డ్రామాకి తెరలేపిందని బీజేపీ నేతల ఎదురుదాడి.. ఈ తంతంగమంతా దేశమంతా చూసేసింది. ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు తమ ఎమ్మెల్యేల కొనుగోలుకి ప్రయత్నించారని పోలీస్ కంప్లైంట్ కూడా చేసింది.

సరిగ్గా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పై అదే ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్దమైనట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. తమ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసిందని.. పోలీసులకు ఫిర్యాదు చేయనున్న రేవంత్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్రం చేసిందని కేసీఆర్ ఎలాగైతే ఆరోపిస్తున్నారో.. రేవంత్ కూడా తమ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని టార్గెట్ చేయబోతున్నారట.

ఇదే విషయంపై శుక్రవారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తుండగా.. సమావేశం అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌ లో బీఆర్ఎస్ పార్టీపై ఫిర్యాదు చేయనున్నారట. గతంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై ఫిర్యాదు చేసింది కూడా ఈ స్టేషన్ లోనే కాగా.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా అదే స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. అలా అయితే.. బీజేపీపై కేసు పరిస్థితిని బట్టి టీఆర్ఎస్ పార్టీపై, ఫిర్యాదుపై ఒత్తిడి చేసేందుకు.. ఆరోపణలకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తుంది. అదే నిజమైతే.. డబ్బు, పదవుల ఆశపెట్టి టీఆర్ఎస్ పార్టీ తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.