BRS Party: నలుగురు సీఎంలతో ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ.. ఇక్కడే ఎందుకంటే?

Kaburulu

Kaburulu Desk

January 9, 2023 | 03:57 PM

BRS Party: నలుగురు సీఎంలతో ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ.. ఇక్కడే ఎందుకంటే?

BRS Party: జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలనుకుంటున్న భారత రాష్ట్ర సమితి ఆ దిశగా పని మొదలు పెట్టింది. ఆ మధ్య ఏపీలో పార్టీ విస్తరణ మొదలు పెట్టిన కేసీఆర్.. అక్కడ కొందరు నాయకులకు పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి తర్వాత మనపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగానే ముందుగా తెలంగాణలో రైతు, రాజకీయ చైతన్య గడ్డగా పేరున్న ఖమ్మంలో ఈ నెల 18న భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్‌ఎస్‌ శంఖారావం పూరించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కాగా.. ఈ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు జాతీయస్థాయి నేతలు రానున్నట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, కేరళ సీఎం పినరాయి విజయన్‌ తో పాటు యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఈ సభకు రానున్నట్లు తెలుస్తుంది.

కాగా.. బీఆర్ఎస్ తొలి సభ ఖమ్మంలోనే ఎందుకు మొదలు పెట్టనున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చకు దారి తీస్తుంది. అయితే.. ఖమ్మంలో ఆవిర్భావ సభను పెట్టాలనుకోవడం వెనక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఖమ్మంలో ఇప్పటికీ కాంగ్రెస్‌కి కాస్త పట్టుంది. అలాంటి చోట.. భారీ బహిరంగ సభ ద్వారా.. కాంగ్రెస్ క్యాడర్ ను తమవైపుకి తిప్పుకోవాలన్నది కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ గా కనిపిస్తుంది.

దాంతో పాటు ఖమ్మంలో ఏపీకి చెందిన వారు ఎక్కువ మంది ఉంటారు. గతంలో చాలా మంది ఖమ్మంను ఏపీలో కలపాలని కూడా కోరారు. ఇప్పుడు అక్కడ సభ నిర్వహించడం ద్వారా.. అటు ఏపీ వారినీ, ఇటు వారినీ.. అందర్నీ ఆకర్షించవచ్చనేది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో ఎంట్రీకి సన్నాహాలు చేస్తున్న పార్టీ.. ఈ సభ ద్వారా ముందుగా అక్కడ ఉన్న ఏపీ ప్రజలకు చేరువకావాలన్న ఆశ కనిపిస్తుంది. దీంతోపాటు దగ్గర్లోనే ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఉండగా ఈ సభ ద్వారా అటు ఛత్తీస్‌గఢ్ వైపు కూడా పార్టీని విస్తరించేందుకు వీలవుతుందనే నమ్మకంతోనే ఖమ్మంని ఎంచుకున్నారని తెలుస్తోంది.