Pawan Kalyan: కొండగట్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వారాహీకి ప్రత్యేక పూజలు

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 11:19 AM

Pawan Kalyan: కొండగట్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వారాహీకి ప్రత్యేక పూజలు

Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ కొండగట్టుకు విచ్చేశారు. ఎన్నికల ప్రచారం కోసం పవన్ ఇప్పటికే తన వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. వాహనానికి కొండగట్టులో నేడు పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి కొండగట్టు ఆలయానికి కూడా చేరుకున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఎంతో సెంటిమెంట్.

అందుకే, ఈ ఆలయంలోని స్వామివారిని పూజించుకొని తన ఎన్నికల సమరాన్ని సాగించడానికి, తాను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొండగట్టు అంజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజలు అనంతరం తన మొదటి ప్రస్థానాన్ని ప్రారంభించనుంది పవన్ కళ్యాణ్ వారాహి. తన ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామికి పూజలు చేసిన అనంతరం పవన్ వచ్చే ఎన్నికల కోసం వారాహి వాహనంతో ఎన్నికల సమరాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జనసేనాని పర్యటన నేపథ్యంలో తెలంగాణలోని జనసేన కార్యకర్తలు, నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు కొండగట్టుకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్ కాన్వాయ్.. హకీంపేట్‌లో కాసేపు ట్రాఫిక్‌ లో చిక్కుకుంది. అయితే, పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి.. పవన్ కాన్వా య్ ని పంపించారు. మరోవైపు జనసేనాని పర్యటన సందర్భంగా కొండగట్టు, ధర్మపురిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

కొండగట్టులో పూజల అనంతరం సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలో లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో పవన్ సమావేశం అవుతారు. ఇక ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ 32 నారసింహ క్షేత్రాలను సందర్శించనున్నారు. ముందుగా ఈ యాత్రలో ఆయన తొలిసారిగా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. మరోవైపు పవన్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై కూడా నియోజకవర్గ కార్యనిర్వాహక సభ్యులతో సమావేశం కానున్న నేపథ్యంలో వారిలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.