Kuppam Tour: చంద్రబాబు రోడ్ షోకు అనుమతి నిరాకరణ.. కుప్పంలో తీవ్ర ఉత్కంఠ

Kaburulu

Kaburulu Desk

January 4, 2023 | 08:35 AM

Kuppam Tour: చంద్రబాబు రోడ్ షోకు అనుమతి నిరాకరణ.. కుప్పంలో తీవ్ర ఉత్కంఠ

Kuppam Tour: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేటి నుంచి మూడో రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో మేరకు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి.. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కు నోటీసులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు.

తాజాగా వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇరుకు సంధులు, రోడ్లపై సభలు నిర్వహించకూడదడని చంద్రబాబు పర్సనర్ సెక్రటరీకి మంగళవారమే నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. అయితే.. వాళ్ళ నుండి రాత్రి 10.30 గంటల వరకు సరైన సమాధానం రాకపోవడంతో కుప్పం పర్యటనకు సంబంధించి రోడ్ షో, సభలకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలకు అనుమతి లేదని, ఒకవేళ అనుమతి లేకుండా కొనసాగిస్తే నిర్వాహకులు, పాల్గొనే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

మంగళవారం మధ్యాహ్నం కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులతో సమావేశమైన డీఎస్పీ.. ఇటీవల జరిగిన అవాంఛనీయ ఘటనల దృష్ట్యా పలమనేరు డివిజన్ పరిధిలో ఈ నెల 1-30 వరకు 30 పోలీసు యాక్టు విధిస్తామన్నా రు. అనంతరం ఆంక్షలతో కూడిన నోటీసులను చంద్రబాబు పీఏ మనోహర్ కు అందించారు. అయితే.. పోలీసులు నోటీసులు, ఆంక్షలు విధించినా షెడ్యూల్ ప్రకారమే కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుందని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి వెల్లడించారు.

ర్యాలీలు, సభలపై బ్యా న్‌ విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను పట్టించుకోమని.. యథావిథిగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని టీడీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబు కుప్పం పర్యటనను కొనసాగిస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. కుప్పం పర్యటన ఉంటుందా? ఉండదా? ఒకవేళ ఉంటే పోలీసులు ఏం చేస్తారు ఇలా ఉత్కంఠ కొనసాగుతుంది.