Gudivada Amarnath: పవన్ కళ్యాణ్‌ది జనసేన కాదు కమ్మసేన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు!

Kaburulu

Kaburulu Desk

March 15, 2023 | 11:18 PM

Gudivada Amarnath: పవన్ కళ్యాణ్‌ది జనసేన కాదు కమ్మసేన.. మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు!

Gudivada Amarnath: పవన్ కళ్యాణ్‌ది జనసేన కాదు కమ్మసేన అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఏ ఉద్దేశంతో తాజాగా సభను పెట్టారో పవన్ కే తెలియదని ఎద్దేవా చేసిన అమర్నాథ్.. జెండా పవన్ ది.. అజెండా తెలుగుదేశం పార్టీదని విమర్శించారు. 175కి 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం పవన్ కు లేదని.. జనసేనకు రాజకీయ సిద్ధాంతమే లేదని అన్నారు.

భారత్ కు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలవుతోందని, కానీ టీడీపీ నుంచి జనసేనకు స్వాతంత్రం రాలేదని రెండురోజుల క్రితం పవన్ కల్యాణ్ పై సెటైర్లు పేల్చిన మంత్రి అమర్నాథ్.. తాజాగా కమ్మసేన అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కాపులెవరూ పవన్ కల్యాణ్‌ ను నమ్మటం లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాకు స్క్రిప్ట్, ప్రొడక్షన్ అన్నీ చంద్రబాబు చూసుకుంటున్నారని, దర్శకత్వ బాధ్యతలు మాత్రం నాదెండ్ల మనోహర్‌ కి అప్పగించారన్నారు.

అసలు పవన్‌ కల్యాణ్ బీజేపీతో కలసి ఉన్నారో లేదో చెప్పాలని డిమాండ్ చేసిన మంత్రి అమర్నాథ్.. ప్రధాని మోదీ దగ్గర వేషాలు వేయాల్సిన అవసరం వైసీపీ నేతలకు లేదని, ఆ విషయం పవన్ తెలుసుకోవాలన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నానని చెప్పుకునే పవన్, టీడీపీకి లాభం చేకూర్చే పనులు చేయడానికి రెడీగా ఉంటారని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా టీడీపీకి లబ్ధి చేకూర్చేలా వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారని, ఓట్లు చీలనివ్వబోనంటూ తన అసలు రంగు బయటపెట్టుకున్నారని మండిపడ్డారు.

అంతకుముందు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయని.. ఆ పార్టీకి జనసేన తొత్తుల పార్టీ అని పేరు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. పదేళ్ళ పాటు ఒక అజెండా లేకుండా నడిచిన పార్టీ జనసేన అని విమర్శించారు. పవన్ సభకు వచ్చిన కార్యకర్తలు చాలా అమయాకులని.. పవన్ కల్యాణ్ బంకర్ టు బందర్ అంటూ సెటైర్లు పేల్చారు. నెలన్నర రోజుల పాటు బంకర్ లో దాక్కుని బందరుకి బండేసుకొని వచ్చాడన్నారు.