Pawan Kalyan: ఏపీ రాజకీయాలలో ఇప్పుడు కీలకం జనసేనానేనా?

Kaburulu

Kaburulu Desk

January 1, 2023 | 02:05 PM

Pawan Kalyan: ఏపీ రాజకీయాలలో ఇప్పుడు కీలకం జనసేనానేనా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఏపీలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండగా ఆయన కూడా అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగానే ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పవన్ గత ఎన్నికలలో రెండు చోట్ల పోటీచేయగా రెండు చోట్లా ఓడిపోయారు. అయినా.. ఇప్పుడు ఏపీ రాజకీయం మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతుందా అనే చర్చలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండాగానే ఏపీలో వచ్చే ఎన్నికలలో పొత్తులపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే పని చేయనని ప్రకటించగా.. వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాల ఐక్యతకు కృషి చేస్తానని శపధాలు కూడా చేశారు. మరోవైపు అధికార వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అంతకు మించి ఘాటుగానే స్పందిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా పవన్ వ్యాఖ్యలకు.. వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షాల పొత్తులకు ఒకదానితో మరొకటి భారీ లింకులు కూడా కలవాల్సి ఉంది. అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది.

అధికారికంగా ప్రకటించకపోయినా దాదాపుగా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు ఒకే చెప్పేశారు. అయితే.. అది బీజేపీతో కలిసే టీడీపీతో జతకడతారా లేక విడిగా పొత్తుకు వెళ్తారా అన్నది ఇంకా స్పష్టత లేదు. దీంతో అసలు జనసేన-టీడీపీ పొత్తు ఉంటుందా? లేక బీజేపీ-జనసేన పొత్తు ఉంటుందా? లేక మూడు కలిసి మరికొంతమందిని కలుపుకొని మహా కూటమిగా వెళ్తారా అన్నది ఏపీ రాజకీయాలలో సస్పెన్స్ గా కొనసాగుతుంది.

టీడీపీతో పొత్తుతో ఏపీలో బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ లేకపోగా.. తెలంగాణలో టీడీపీ మళ్ళీ యాక్టివ్ అయితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని టీడీపీ ఖమ్మం సభ తర్వాత కొంత చర్చలు జరిగాయి. అయితే తెలంగాణ బీజేపీ సారధి బండి సంజయ్ టీడీపీతో పొత్తుకు వెళ్ళేదే లేదని తేల్చి చెప్పేశారు. క్యాడర్ కు కూడా అదే విధంగా నిర్ధేశించారు. దీంతో ఇప్పుడు మళ్ళీ అందరి చూపి పవన్ వైపే పడింది. ఏపీ సంగతేంటి? పవన్ సింగిల్ గా వెళ్తారా? సింగిల్ గా టీడీపీ వైపు వెళ్తారా? లేక సింగిల్ గా బీజేపీ వైపు వెళ్తారా అంటూ చర్చలు మొదలయ్యాయి.

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కుదిరితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా పడితే.. అధికార వైసీపీకి అది ఖచ్చితంగా కొంతమేర నష్టమే కలిగిస్తుంది. పొత్తు కుదరక విడిగా పోటీ చేస్తే అది వైసీపీకి భారీ మేలు చేకూర్చుతుంది. దీంతో వైసీపీ నేతలు ఈ పొత్తుల అంశంపై ఎలాంటి ప్రకటనలు వచ్చినా జెట్ స్పీడ్ తో గరంగరం అవుతున్నారు. మొత్తంగా ఏపీ రాజకీయాలలో వచ్చే ఎన్నికలలో ఏం జరగబోతుంది?.. ఎవరు ఎవరితో కలుస్తారు? ఎవరు ఎవరితో విడిపోతారు అన్నది ఆసక్తిగా మారగా.. అందులో పవన్ కీలకంగా కనిపిస్తున్నారు.