T.G.Venkatesh: ఒక్క సీటు రాని పవన్.. బాబుని కలిస్తే వైసీపీ గగ్గోలు దేనికి.. లాజిక్కే కదా?!

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 12:38 PM

T.G.Venkatesh: ఒక్క సీటు రాని పవన్.. బాబుని కలిస్తే వైసీపీ గగ్గోలు దేనికి.. లాజిక్కే కదా?!

T.G.Venkatesh: తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన నివాసానికి వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయాలపై ఐక్య పోరాటానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ రెండు పార్టీల నుండి మీడియాకి చెప్పింది ఐక్య పోరాటమే అయినా.. వచ్చే ఎన్నికలలో రెండు పార్టీల పొత్తుకు మార్గం సుగుమమైందన్నది రాజకీయమెరిగిన సత్యం.

కాగా.. అలా పవన్ చంద్రబాబు నివాసానికి వెళ్లారో లేదో.. వైసీపీ నేతలు విమర్శల బాణాలు మొదలు పెట్టారు. ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు అందరూ మీడియాను పిలిచి ఏకిపారేశారు. మంత్రి అంబటి, రోజా లాంటి వాళ్ళైతే.. సంక్రాంతి గంగిరెద్దు పండగ చందా కోసం వెళ్లిందని.. సంక్రాతి మామూళ్ల కోసమే పవన్ దత్త తండ్రి వద్దకు వెళ్లారని తీవ్ర విమర్శలు చేశారు. మొత్తంగా మాజీ మంత్రులు, ఇప్పటి మంత్రులు కలిసి చంద్రబాబు-పవన్ కలయికను భూతంగా చూపించే ప్రయత్నం చేశారు.

అయితే దీనిపై స్పందించిన బీజేపీ నాయకులు టీజీ వెంకటేష్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేడని.. రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయాడని.. ఒక్క సీటు కూడా రాని పవన్ కళ్యాణ్ రాజకీయాలకే పనికిరాడని విమర్శలు చేసే వైసీపీ నేతలకు చంద్రబాబును కలిస్తే ఇంత గగ్గోలు ఎందుకని ప్రశ్నించారు. పవన్ వలన నష్టమేలేదని మీరే చెప్తూనే మళ్ళీ మీరే ఎందుకు అంతగా టార్గెట్ చేస్తారని వైసీపీ నేతలను ప్రశ్నించారు.

ఇక పొత్తులపై ఎన్నికలకు ఆరు నెలల ముందే క్లారిటీ వస్తుందని పేర్కొన్న ఆయన.. చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రవర్తనే కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీతో జనసేన పొత్తు ఉన్నప్పటికీ, మళ్లీ టిడిపి వైపు వెళ్లక తప్పని పరిస్థితి కల్పించారని, ఈ పరిణామాలకు వైసీపీనే కారణమంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలకు కారకులు ఎవరో అందరికీ తెలుసన్నారు. ఇక.. టీడీపీతో బీజేపీ పొత్తు వ్యవహారంలో ఫైనల్ నిర్ణయం అధిష్టానానిదేనని స్పష్టం చేశారు.