BRS Party: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్, ఆప్

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 08:49 AM

BRS Party: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్, ఆప్

BRS Party: బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కేంద్రంపై సమర శంఖం పూరించిన సంగతి తెలిసిందే. తెలంగాణపై కేంద్రం చిన్న చూపు అనే ఆలోచన.. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందనే ఆరోపణ, అన్నిటికి మించి రాష్ట్రాల హక్కులను కూడా కేంద్రం కాలరాస్తుందనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ తన టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే.

ఇప్పటికే రాష్ట్రంలో గవర్నర్, సీఎం మధ్య కాన్స్టిట్యూషనల్ వార్ జరుగుతుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రాధాన్యతపై ఇరు వర్గాలు ఎవరికి వారు పంతాలకు పోతుండగా.. మరోవైపు కేంద్రంలో నేటి నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్, ‘ఆప్’ నిర్ణయించినట్టు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు.

ఢిల్లీలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేకే పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమైందని, ఇందుకు నిరసనగానే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని తమ రెండు పార్టీలు నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రపతి ఉపన్యాసం బహిష్కరణకు గల కారణాన్ని నేటి మధ్యాహ్నం విజయ్ చౌక్ వద్ద వెల్లడిస్తామన్నారు.

కాగా, బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, తెలంగాణపై కుట్రలను ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎండగడతామని అన్నారు. ఇప్పటికే ఈ సమావేశాలపై తమ పార్టీ ఎంపీలకు దిశానిర్ధేశం చేసిన సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలి సెషన్ కావడంతో కొంతమేర శిక్షణా తరగతులు కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. కాగా.. బీఆర్ఎస్ ఆప్ కి తోడై పోరాటం మొదలు పెట్టడం వెనక కూడా భారీ కారణాలే ఉన్నట్లుగా కనిపిస్తుంది.