Pakistan Food Crisis: పాక్‌లో ఆకలి కేకలు.. గోధుమ పిండి కోసం తొక్కిసలాట

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 11:59 PM

Pakistan Food Crisis: పాక్‌లో ఆకలి కేకలు.. గోధుమ పిండి కోసం తొక్కిసలాట

Pakistan food crisis: దాయాది దేశం పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతుంది. నిత్యావసర సరుకులు కూడా కొనలేని స్థితికి అక్కడి ప్రజలు చేరుకోగా.. రాయితీపై అందించే నిత్యావసర వస్తువులపై కూడా పాక్ ప్రభుత్వం కోత పెడుతోంది. ఒకవైపు ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మరోవైపు ప్రభుత్వం నుండి అందాల్సిన సరుకులు కూడా ప్రజలకు అందడం లేదు.

ఇప్పటికే పాక్ లో ఒక్కో సిలిండరు 3 వేల నుండి 4 వేల రూపాయలు పలుకుతుండగా.. దేశంలోనే ఎక్కువగా వినియోగించే గోధుమల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో అక్క‌డ తీవ్ర సంక్షోభం ఏర్ప‌డింది. ఎంతలా అంటే గోధుమ పిండి కోసం ఇక్కడి ప్ర‌జ‌లు ఎగబడి కొట్టుకొనేంత. ఖైబ‌ర్ ఫ‌క్తున్కా అనే రాష్ట్రంలో అనేక చోట్ల ఈ గోధుమ పిండి కోసం అల్ల‌ర్లు చెల‌రేగాయి. ప్ర‌భుత్వం ఇచ్చే స‌బ్సిడి గోధుమ పిండి కోసం జ‌నం భారీ సంఖ్య‌లో క్యూ క‌డుతున్నారు.

కరాచీలో కేజీ గోదుమ పిండి 140 నుంచి 160 రూపాయలు పలుకుతుండగా.. దేశంలోని అనేక ప్రాంతాలలో 10 కిలోల పిండి సంచి రూ.15,00 ఉండగా..20 కిలోల బ్యాగ్ ధర రూ.2,800 ధర పలుకుతోంది. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌ నివేదిక ప్రకారం మార్కెట్‌లో ఇప్పటికే సరఫరాలో తక్కువ ఉన్న పిండి బస్తాలను పొందేందుకు ప్రతిరోజూ పదివేల మంది గంటల పాటు క్యూలో గడుపుతున్నారని పేర్కొంది. మరోవైపు షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించేందుకు సిద్ధమైంది.

ఇప్ప‌టికే మార్కెట్లో గోధుమ పిండి షార్టేజ్ ఉన్న‌ట్లు అధికారులు చెబుతుండగా.. అక్కడ పంపిణీ చేసే గోధుమపిండి ఒక్కటే వారికి ఆధారం కావడంతో తొక్కిసలాటలు సర్వసాధారణం అయ్యాయి. అక్కడ భద్రతా బలగాల నీడలో గోధుమపిండి పంపిణీ చేస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎంత బలగాలు ఉన్నా ప్రభుత్వం పంపిణీ చేసే గోధుమపిండి కోసం ఇక్కడ తీవ్ర తొక్కిసలాటలు జరుగుతున్నాయి. తాజాగా తన ఆరుగురి సంతానం కడుపు నింపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి పిండి కోసం జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు.