Cold Wave: చలి పంజా.. ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్!

Kaburulu

Kaburulu Desk

January 9, 2023 | 09:11 AM

Cold Wave: చలి పంజా.. ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్!

Cold Wave: తెలంగాణలో చలి పులి వణికిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఊహించని స్థాయిలో పెరిగింది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ తగ్గుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రాత్రిపూట, తెల్లవారుఝామున మాత్రమే కాదు.. మధ్యాహ్నం సమయంలోనూ శీతల వాతావరణమే ఉంటోంది.

ఒకవైపు పంజాబ్, హర్యానా, చండీగఢ్, దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతదేశం చలితో వణుకుతుండగా.. తెలంగాణలో కూడా అదే స్థాయిలో చలి పంజా విసురుతుంది. జనవరి 11 వరకు రాష్ట్రంలో ఇలాగే చలి కొనసాగుతుందని ఐఎండీ హైదరాబాద్ శాఖ తెలిపింది. జనవరి 9,10 తేదీల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు ఉత్తరాంధ్రలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసిరింది. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా చోట్ల సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొమురం భీం జిల్లాలో 4.8గా నమోదయింది. ఆదిలాబాద్ జిల్లాలో 5.6 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 6.8 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలో 8.5గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దీంతో పాటు ఈ సీజన్‌లో రాబోయే రోజుల్లో ఎన్నడూ చూడనంతగా చలి తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరభారతదేశంలో వీస్తున్న చలి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వెల్లడించింది. తెలంగాణలో మూడు రోజుల క్రితం వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి. చలికాలంలోనూ వేసవిలా చాలా ప్రాంతాల్లో ఉక్కపోతగా అనిపించింది. కానీ అంతలోనే చలి పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి కొన్ని ప్రాంతాలలో కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. మరో వారం పదిరోజుల పాటు ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.