TDP: బెజవాడ తెలుగు తమ్ముళ్ల ఓపెన్ కామెంట్స్.. తారస్థాయికి అంతర్గత పోరు?

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 04:22 PM

TDP: బెజవాడ తెలుగు తమ్ముళ్ల ఓపెన్ కామెంట్స్.. తారస్థాయికి అంతర్గత పోరు?

TDP: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. కానీ.. ఇక్కడ రాజకీయం మాత్రం ఇప్పటికే పీక్స్ కు చేరింది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు యాత్రలకు సిద్ధమవుతుంటే.. ప్రభుత్వం ఇంకేం చేస్తే మళ్ళీ అధికారం వస్తుందా అని వేటలో పడింది. ఇదిలా సాగుతుండగానే అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఎవరికి వారు సీట్ల వ్యవహారంపై విన్నపాలు.. అలకలు కూడా మొదలు పెట్టేస్తున్నారు. అధికారంలో ఉన్నారు కనుక వైసీపీలో ఇప్పుడు ఈ సీట్ల గోల బయటపడదు కానీ.. టీడీపీలో మాత్రం టికెట్ల లొల్లి అప్పుడే మొదలైంది.

బెజవాడ టీడీపీలో చాలా రోజుల క్రితమే ఈ గ్రూపు వ్యవహారాలు బయటపడ్డాయి. అయితే.. అప్పటికి చంద్రబాబు బుజ్జగింపులతో కాస్త చల్లబడిన తమ్ముళ్లు సమయం వచ్చినపుడు మాత్రం బయటపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని నాని మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. ఇప్పటికే వీరు బహిరంగంగా విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉండగా.. అధిష్టానం హెచ్చరికల అనంతరం ఇప్పుడు పరోక్షంగా విమర్శలకు దిగుతున్నారు.

తాజాగా బుద్దా వెంకన్న ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ప్రత్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అసెంబ్లీలో చంద్రబాబు వెనుక కూర్చుని ఆయన్ని అవమానించిన వారి అంతు చూస్తామన్నారు. తాను, నాగుల్ మీరా ఇద్దరం ఈసారి చట్ట సభల్లో అడుగుపెడతామని ప్రకటించారు. ఇక, నాగుల్ మీరా కూడా విజయవాడ పశ్చిమలో ఈ సారి పోటీచేసి గెలిచేది తెలుగుదేశమే అని ధీమా వ్యక్తం చేశారు.

అయితే పశ్చిమ నియోజకవర్గానికి కేశినేని నాని ఇంచార్జ్ గా ఉన్నారు. అక్కడ కేశినేనికి చెక్ పెట్టడానికి బుద్ధా వర్గం ప్రయత్నిస్తూ కేశినేని నానీ తమ్ముడైన చిన్నీని ఫోకస్ చేస్తుంది. చిన్నీ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అన్నకి చెక్ పెట్టేందుకు చూస్తున్నారు. చిన్నీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే ఈ ఇద్దరూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక, వచ్చే ఎన్నికల్లో వెస్ట్ సీటు కేశినేని కుమార్తెకు ఇస్తారనే ప్రచారం ఉండగా ఇటు బుద్దా లేదా నాగుల్ మీరా వెస్ట్ లో పోటీ చేయాలని చూస్తున్నారు. తమ్ముళ్ల మధ్య ఇంత పెద్ద అగాధం ఉండడంతోనే టీడీపీ అధిష్టానం జనసేనతో పొత్తు కుదిరితే ఈ సీటు వాళ్ళకి వదిలేయాలని చూస్తున్నట్లుగా వినిపిస్తుంది. మరి.. ఎన్నికల సమయానికి ఈ ఇన్నర్ ఫైట్ ఎలా వెళ్తుందో చూడాలి.