Ojuelegba bridge accident: బస్సులపైకి దూసుకెళ్లిన భారీ వాహనాలు.. 20 మంది మృతి

Kaburulu

Kaburulu Desk

January 30, 2023 | 10:27 AM

Ojuelegba bridge accident: బస్సులపైకి దూసుకెళ్లిన భారీ వాహనాలు.. 20 మంది మృతి

Ojuelegba bridge accident: రెండు బస్సులపైకి దూసుకెళ్లిన రెండు భారీ వాహనాల వేర్వేరు ప్రమాదాలలో ఇద్దరు చిన్నారుల సహా ఇరవై మంది మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. అందులో ఒక ప్రమాదంలో భారీ కంటైనర్ బస్సుపై పడగా.. ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మరణించారు. మరో ప్రమాదంలో ఓ భారీ ట్రక్కు బస్సును ఢీ కొట్టడంతో మరో 11 మంది మరణించారు.

నైజీరియా లాగోస్ లో ఈ రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఓజులెగ్బా ప్రాంతంలో రద్దీగా ఉండే ఓజులెగ్బా వంతెనపై బస్సు ఆగివుండగా 20 అడుగుల ఓ భారీ కంటైనర్ బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు ఎక్కుతున్న ఇద్దరు చిన్నారులు సహా 9 మంది ప్రయాణికులు మరణించారు. ఆదివారం జరిగిన ఈ భారీ ప్రమాదంలో అదృష్టం కొద్దీ ఓ మహిళ సురక్షితంగా బయటపడింది.

ఇక ఆదివారం నైజీరియాలో మరో భారీ ప్రమాదం కూడా చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఒండో రాష్ట్రంలోని ఒడిగ్బో కౌన్సిల్ ప్రాంతంలో మరో ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. ట్రక్కు వేగంగా బస్సును ఢీ కొట్టడంతో అక్కడ మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. ఈ ప్రాంతమంతా రక్తసిక్తమై.. అగ్నిప్రమాదంతో చెల్లాచెదురుగా కనిపించింది.

ఆఫ్రికా దేశమైన నైజీరియాలో రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంభవించడం అత్యంత సహజంగా మారిపోయింది. గత ఏడాది దేశంలోనే రెండో అతిపెద్ద నగరం మారాడిలోని ఓ పాఠశాలలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 20 మంది పిల్లలు మృతిచెందగా.. మరో రోడ్డు ప్రమాదంలో 12 మంది ఒకేసారి మరణించారు. ఇలా తరచుగా అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నా.. అధికారులు, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.