IT Rides: 40 కార్లు, 3 బస్సుల్లో అధికారులు.. హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న ఐటీ రైడ్స్

Kaburulu

Kaburulu Desk

January 4, 2023 | 03:35 PM

IT Rides: 40 కార్లు, 3 బస్సుల్లో అధికారులు.. హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న ఐటీ రైడ్స్

IT Rides: హైదరాబాద్‌లో ఐటీ రైడ్స్ హడలెత్తిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 కార్లు, మూడు సీఆర్పీఎఫ్ బస్సులలో వచ్చిన అధికారులు భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో మొదలు పెట్టిన ఐటీ సోదాలు.. 20 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు మొదలు పెట్టారు. గచ్చిబౌలి, బాచుపల్లి, చందా నగర్‌లోనూ ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైతో పాటు దేశ వ్యాప్తంగా మొత్తంగా 18 చోట్ల ఐటీ సాదాలు జరుగుతున్నాయి.

ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ టార్గెట్ గా మొదలు పెట్టిన ఈ రైడ్స్ లో దేశ వ్యాప్తంగా వీరికి బ్రాంచ్ లు ఉండగా అన్ని బ్రాంచీలలో సోదాలు జరుగుతున్నాయి. చెన్నై ప్రధాన కేంద్రంగా ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కార్యకలాపాలు నడుస్తుండగా.. పన్నుల చెల్లింపులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో రైడ్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. టైర్లు, కెమికల్ ఉత్పత్తుల తయారీలో ఉన్న ఎక్సెల్ తో పాటు దాని అనుబంధ కంపెనీలపై ఐటీ అధికారులు తెల్లవారు జాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.

ఏక కాలంలో హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఎక్సెల్ కంపెనీ పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు ఫ్రాంచైజీగా వ్యవహరిస్తుండగా.. ఆయా కంపెనీల్లో కూడా సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఐటీ అధికారులు రావడం.. పదుల సంఖ్యలో అధికారులు సోదాలు చేయడం.. దేశవ్యాప్తంగా ఒకేసారి సోదాలతో ఇతర ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ టార్గెట్ గా కొంత కాలంగా ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా భారీ స్థాయిలో రైడ్స్ తో ఎప్పుడు ఎవరిపై ఐటీ రైడ్స్ జరుగుతాయనే ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది.