Naba Kisore Das: పోలీస్ కాల్పులలో గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి కన్నుమూత

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 11:43 PM

Naba Kisore Das: పోలీస్ కాల్పులలో గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి కన్నుమూత

Naba Kisore Das: ఒడిశాలోని బ్రిజరాజ్ నగర్ లో ఆదివారం ఉదయం ఏఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవకిశోర్ దాస్ కన్నుమూశారు. కాల్పుల్లో ఆయన ఛాతి భాగంలోకి తూటా దూసుకెళ్లడంతో చికిత్సపొందుతూ మంత్రి ప్రాణాలు విడిచినట్టు అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.నిజానికి ఆస్పత్రికి తీసుకురాగానే డాక్టర్ దేబాశిస్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం హుటాహుటిన ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది.

అయితే, ఆయన శరీరంలోకి దూసుకెళ్లిన ఓ బుల్లెట్ గుండె, ఎడమ వైపు ఊపిరితిత్తుల భాగంలో గాయం చేయడంతో అధిక రక్తస్రావం జరిగి ఆయన మరణించినట్లు వైద్యులు చెప్తున్నారు. ఒడిశాలోని ఝార్సుగూడా జిల్లా బజరంగ్ టౌన్ లో ఓ మీటింగ్ కి హాజరయ్యేందుకు ఆరోగ్యశాఖ మంత్రి కిశోర్ దాస్ వెళ్తుండగా ఈ కాల్పులు జరపగా.. ఆయన ప్రాణాలతో పోరాడి తుది శ్వాస విడిచారు.

ఈ కాల్పులకు సంబంధించి గోపాల్ దాస్ అనే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తన సర్వీసు రివాల్వర్ నుంచి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో మంత్రి కిషోర్ దాస్ పై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు భ్రజ్‌రాజ్‌నగర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి గుప్తేశ్వర్ భోయ్ మీడియాకు తెలిపారు. కాల్పుల్లో మంత్రి నవకిశోర్‌దాస్‌కు తీవ్ర గాయాలవగా.. ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు.

మంత్రి నవ కిశోర్ దాస్ మృతి పట్ల ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు చేయాల్సిందంతా చేశారని.. కానీ దురదృష్టవశాత్తు ఆయన రికవరీ కాలేకపోయారన్నారు. తమ ప్రభుత్వానికి, పార్టీకి ఆయన గొప్ప ఆస్తిఅని.. ఆరోగ్య శాఖలో అనేక కార్యక్రమాలను విజవయంతంగా నిర్వహించి ప్రజలకు లబ్దిచేకూరేందుకు
కృషిచేశారని కొనియాడారు. నవకిశోర్ దాస్ బిజూ జనతాదళ్ పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా పనిచేశారని గుర్తుచేసుకున్నారు.

కాగా, బిజూ జనతాదళ్లో సీనియర్ నేత అయిన నవకిశోర్ దాస్.. మహారాష్ట్రలోని శని శింగణాపుర్ దేవాలయానికి రూ.కోటికిపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. మంత్రిపై దాడులు జరగడం.. ఇలా కాల్పులు జరగడం విస్మయానికి గురిచేసింది. అయితే ఇక్కడ ఎన్నికల సమయంలో ఇటువంటి హింసాత్మక ఘటనలు తరచూ జరుగుతుంటాయని.. ఇవి ఆందోళన కలిగించే విషయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.