Naba Kisore Das: ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రిపై పోలీస్ కాల్పులు.. పరిస్థితి విషమం

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 02:58 PM

Naba Kisore Das: ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రిపై పోలీస్ కాల్పులు.. పరిస్థితి విషమం

Naba Kisore Das: ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవ కిషోర్ దాస్ పై ఓ పోలీస్ అధికారి కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో మంత్రి ఛాతీకి బుల్లెట్ గాయాలు కాగా.. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఒడిశాలోని ఝార్సుగూడా జిల్లా బజరంగ్ టౌన్ లో ఓ మీటింగ్ కి హాజరయ్యేందుకు కిశోర్ దాస్ వెళ్తుండగా ఈ కాల్పులు జరిపారు.

గోపాల్ దాస్ అనే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తన సర్వీసు రివాల్వర్ నుంచి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో మంత్రి కిషోర్ దాస్ పై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఏఎస్ఐ గోపాల్ దాస్ ఈ కాల్పులు జరిపినట్టు భ్రజ్‌రాజ్‌నగర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి గుప్తేశ్వర్ భోయ్ మీడియాకు తెలిపారు. కాల్పుల్లో మంత్రి నవకిశోర్‌దాస్‌కు తీవ్ర గాయాలవగా.. ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, మంత్రిపై కాల్పులు జరిపి పరారైన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మంత్రి తన కారు నుంచి బయటకు వస్తుండగా ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడిన మంత్రిని కారులో ఆసుపత్రికి తరలిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూసింది.

కాగా, ఏ కారణంతో మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు జరిపాడనేది తెలియాల్సి ఉండగా.. మంత్రి నవ కిషోర్ దాస్ కి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతికరమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. బహుశా ఈ దాడి ప్లాన్ ప్రకారమే జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మంత్రిపై కాల్పులు జరపడంతో బిజూ జనతాదళ్ కార్యకర్తలు ఆ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. తమ నాయకుడిపై కాల్పులు జరిగిన నిందితుడిని తమకి అప్పగించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.