YS Sharmila: వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. అన్నకు షర్మిల కీలక సూచనలు!

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 06:50 PM

YS Sharmila: వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు.. అన్నకు షర్మిల కీలక సూచనలు!

YS Sharmila: ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా.. సోమవారం పులివెందులకు వెళ్లిన సీబీఐ అధికారులు.. అవినాష్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకి నోటీసులు అందజేశారు. మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

సీబీఐ ఇచ్చిన నోటీసులపై స్పందించిన వైఎస్ అవినాష్ రెడ్డి.. లేఖ ద్వారా సీబీఐ అధికారులకి సమాధానం ఇచ్చారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని.. కాకపోతే బిజీ షెడ్యూల్ కారణంగా ఐదు రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పినట్లు తెలిసింది. అదలా ఉండగానే సీబీఐ అధికారులు.. కడప నుంచి పులివెందులకు బయలు దేరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సీబీఐ అధికారులు అదనపు భద్రత కోరినట్లు తెలుస్తుండగా.. అవినాష్ ను అరెస్ట్ చేస్తారా? అనే ప్రచారం కూడా జరుగుతుంది.

ఒకవైపు వివేకా హత్యకేసు.. ఎంపీ అవినాష్ కు నోటీసులు చర్చ జరుగుతుండగానే సీఎం జగన్ సోదరి, వివేకా సోదరుడి కుమార్తె వైఎస్ షర్మిల ఈ హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవిధంగా తన అన్న జగన్ మోహన్ రెడ్డికి కీలక సూచనలు కూడా చేశారు. కడపలో వైఎస్ వివేకానందరెడ్డి గొప్ప నాయకుడు అని, హత్య జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఎటూ తేలడం లేదని, హత్య కేసును తొందరగా తేల్చాలని కోరుతున్నట్లు చెప్పారు.

అంతేకాదు, అన్నయ్య అయిన ఏపీ సీఎం జగన్ కు ఈ కేసు విషయంలో షర్మిల ఓ కీలక సలహా ఇచ్చారు. ఈ కేసులో జరుగుతున్న సీబీఐ దర్యాప్తులో ఏపీ ప్రభుత్వం, అధికారులు ఎలాంటి జోక్యం చేసుకోకూడదని ఆమె సూచించారు. తద్వారా అధికార పార్టీ తన బలంతో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయవద్దని షర్మిల కోరారు. ఇప్పటికే కేసు దర్యాప్తుపై పలు అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిగా మారాయి.