Raja Singh: జైలుకు వెళ్లడమే కాదు.. చావడానికైనా సిద్దమే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 03:30 PM

Raja Singh: జైలుకు వెళ్లడమే కాదు.. చావడానికైనా సిద్దమే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Raja Singh: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మంగళహాట్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జనవరి 29న ముంబైలోని దాదర్లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టు విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని.. రెండు రోజుల్లో వీటిపై సమాధానం చెప్పాలని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నోటీసులపై రాజాసింగ్ మంగళవారం స్పందిస్తూ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాన్ని ఎనిమిదో నిజాం పాలిస్తున్నారని విమర్శించిన రాజాసింగ్.. నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని.. పోలీసులు జైలుకు పంపినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని, గోహత్య, మతమార్పిడులు, లవ్ జీహాద్పై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం మతవిద్వేషాలను రెచ్చగొట్టడమా అని ప్రశ్నించారు. నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నాకు మంచి జీవితం లభించింది.

ఇప్పుడు నాది ఒకటే లక్ష్యం.. ధర్మం గురించి చావాలి, ధర్మం గురించి బతకాలి! మీరు జైలుకు పంపిస్తారా, తెలంగాణ నుంచి తరిమేస్తారా.. ఏంచేస్తారో చూస్తాను.. నేను సిద్ధంగా ఉన్నాను అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడితే మంగళహట్ పోలీసులు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం తాను బెంగుళూరులో ఉన్నట్టుగా రాజాసింగ్ వివరించారు.

గతేడాది అజ్మీర్ దర్గాపై ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. ఆ తరువాత ఈ కేసును కంచన్ భాగ్ నుండి మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళ్ హాట్ పోలీసులు జనవరి 20న 41A CRPC కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు రాజాసింగ్ స్పందించకపోవడంతో మరోసారి పోలీసులు నోటీసులు పంపించారు. దీనిపై రాజాసింగ్ వివరణ ఇస్తూ జైలుకు వెళ్ళడానికే కాదు చావడానికైనా సిద్ధమనేనని ప్రకటించారు.