Telangana Congress: భద్రాద్రి నుండి కాదు.. రేవంత్ పాదయాత్ర ఎక్కడి నుండి మొదలంటే?

Kaburulu

Kaburulu Desk

February 1, 2023 | 11:22 PM

Telangana Congress: భద్రాద్రి నుండి కాదు.. రేవంత్ పాదయాత్ర ఎక్కడి నుండి మొదలంటే?

Telangana Congress: ఎన్నికలు దగ్గర పడడంతో రాజకీయ పార్టీల పాదయాత్రలు మొదలైపోయాయి. ఎన్నికల సీజన్ అంటే రాజకీయ యాత్రల సీజన్ అనే అర్ధం అందరికీ తెలిసిందే కదా. ఒకవైపు ఏపీలో టీడీపీ నుండి నారా లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహితో యాత్ర మొదలు పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే బీజేపీ నుండి బండి సంజయ్ కొన్ని ప్రాంతాలలో యాత్రలు చేయగా మళ్ళీ త్వరలోనే మిగతా ప్రాంతాలలో కూడా యాత్ర మొదలు పెట్టనున్నారు.

ఇక తెలంగాణలో మరో బలమైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పాదయాత్రకి సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీ నుండి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే ఈ యాత్రను ప్రారంభించనున్నారు. మొత్తం 60 రోజుల పాటు తెలంగాణలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్ చేశారు.

తొలి విడత యాత్ర పూర్తి చేసిన తర్వాత రెండో విడత పాదయాత్రను చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. గత నెల చివరి వారం నుండి పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. కానీ కొన్ని కారణాలతో పాదయాత్ర ప్రారంభం కాలేదు. అయితే ఇప్పుడు ఈ పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నుండి మొదలు పెట్టనుంది అన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ముందుగా ఈనెల 6 నుండి రేవంత్ రాములవారి సన్నిధి భద్రాద్రి నుండి పాదయాత్ర మొదలు పెట్టాలని అనుకున్నారు.

కానీ.. ఇప్పుడు ములుగు నుండి పాదయాత్రను ప్రారంభించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దీనికి కారణం ఇప్పుడు ములుగు జిల్లా నుండి వన దేవతల మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర జరుగుతుంది. గతంలో పాదయాత్ర అనుకున్న సమయంలో భద్రాద్రిలో ఉత్సవాలు జరుగుతుండగా.. ఇప్పుడు ములుగు నుండి మేడారం మినీ జాతర జరుగుతుంది. దాని కారణంగానే రేవంత్ దేవతల ఆశీస్సులతో పాటు ములుగు ఏజెన్సీ ప్రాంతం ప్రజల కష్టాలను హైలెట్ చేసేలా పాదయాత్ర మొదలు పెట్టాలని భావిస్తున్నారట.