TS Congress: మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్‌కు కొత్త ఇంచార్జ్.. పార్టీ నేతలలో ఉత్కంఠ

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 04:39 PM

TS Congress: మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్‌కు కొత్త ఇంచార్జ్.. పార్టీ నేతలలో ఉత్కంఠ

TS Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జ్ గా మాణిక్యం ఠాకూర్ పోయి.. మాణిక్రావు ఠాక్రే వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ పార్టీకి కొత్త ఇంచార్జ్ అయితే వచ్చారు కానీ.. ఇంకా పార్టీ వ్యవహారాలలో ఆయన వేలు పెట్టలేదు. దీంతో కొత్త ఇంచార్జ్ రాష్ట్రానికి ఎప్పుడు వస్తారు? ఆయన వచ్చాక పార్టీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండనున్నాయన్న ఆసక్తి కనిపించింది. అయితే.. ఆయన రానే వస్తున్నారట. మరో నాలుగు రోజులలో తెలంగాణ కొత్త ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే హైదరాబాద్ రానున్నారట.

ఈనెల 11న తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ హైదరాబాద్ రానున్నారు. 11,12 తేదీల్లో రెండు రోజుల పాటు పార్టీ సమావేశాలు నిర్వహించనున్నారట. 11 తేదీన 10 గంటలకు హైదరాబాద్ రానున్న మాణిక్రావు ఠాక్రే 11:30గంటలకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశం.. 12 గంటలకు సీఏల్పీ నేతతో సమావేశం.. 12:30కు సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ లతో సమావేశమై చర్చించనున్నారట.

నేతలతో విడివిడిగా సమావేశమైన తర్వాత.. 3 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్.. 4 గంటలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ప్రసంగించి.. 5 గంటలకు పీసీసీ అధికార ప్రతినిధులతో సమావేశంలో పాల్గొననున్నారట. మరుసటి రోజు 12 తేదీన ఉదయం 10:30కి డీసీసీ అధ్యక్షులతో సమావేశం..11:30 గంటలకు అనుబంధ సంఘాల అధ్యక్షులతో భేటీ అయి 12:30 గంటలకు పార్టీలోని వివిధ సెల్స్, డిపార్ట్మెంట్ అధ్యక్షులతో సమావేశమై అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారట.

కాగా, కొత్త ఇంచార్జ్ రాకతో తెలంగాణ ప్రదేశ్ కమిటీలో ఆసక్తి మొదలైంది. పార్టీలో సీనియర్ నేతలతో పీసీసీ అధ్యక్షుడి వర్గానికి గిట్టకపోవడంతో దానిపై ఏమైనా రాజీ చేసే ప్రయత్నం చేస్తారా? మరోవైపు సీనియర్లలో కొందరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ప్రతిపాదన చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో కొత్త ఇంచార్జ్ ఏం చేయనున్నారన్నది ఆసక్తిగా మారింది. సీనియర్లు, రేవంత్ వర్గం మధ్య పోరులో ఇంతకు ముందున్న మాణిక్యం ఠాకూర్ ఏం చేయలేక చేతులెత్తేసినట్లు చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మాణిక్రావు ఠాక్రే నిర్ణయాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తిగా మారింది.