T Congress: టీ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. బీఆర్‌ఎస్‌తో పొత్తుకి కొందరు.. వద్దని మరికొందరు?

Kaburulu

Kaburulu Desk

January 5, 2023 | 03:04 PM

T Congress: టీ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. బీఆర్‌ఎస్‌తో పొత్తుకి కొందరు.. వద్దని మరికొందరు?

T Congress: పరిస్థితి ఏదైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు కొదువే ఉండదు. ఒకరికి పదవి వచ్చినా గొడవే.. రాకపోయినా గొడవే. ఒకరితో పొత్తు పెట్టుకున్నా లొల్లే.. పొత్తు వద్దని చెప్పినా లొల్లే. సీనియర్లకు కాస్త చోటు ఇచ్చినా తగాదా.. జూనియర్లను కాదన్నా తగాదే.. అలా ఉంటది కాంగ్రెస్ తోటి. చాలాకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుల లొల్లి ఒకటి నడుస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉంటూ వస్తోన్న పాతకాపులకు పార్టీ పగ్గాలను అప్పగించాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. కొద్దిరోజుల కిందటే దిగ్విజయ్ సింగ్ తెలంగాణ వచ్చి ఇది సరిచేయాలని చూశారు. సీనియర్లకు మద్దతుగా ఉండే ఆయన మాట ఇక్కడ చెల్లలేదు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా తనవంతు ప్రయత్నం చేశారు. తెలంగాణ పరిస్థితిని హైకమాండ్ దృష్టికీ తీసుకెళ్లారు. కానీ, అది కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇక్కడ గొడవ అంతా సీనియర్లు, రేవంత్ రెడ్డి వర్గీయుల మధ్యనే అనేది క్లియర్ కట్.

తెలంగాణ కాంగ్రెస్ కు నచ్చజెప్పాలని చూసిన మాణిక్యం ఠాకూర్ ఏకంగా తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్‌ తప్పుకున్నారు. ఆ స్థానంలో మాణిక్‌ రావు థాకరేను అధిష్ఠానం నియమించింది. అయితే.. మాణిక్యం ఠాకూర్ ఇంచార్జ్ బాధ్యతల నుండి తప్పుకోవడం వెనక పెద్ద కారణమే ఉందని కూడా ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలలో చర్చ జరుగుతుంది. అసలే పాతాళానికి పడిపోతున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఓ కొత్త లొల్లి మొదలైనట్లు రాజకీయ వర్గాలలో ఓ చర్చ నడుస్తుంది.

సీనియర్ లీడర్లలో కొందరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు ఇచ్చేలా చర్చలు జరపాలని పీసీసీపై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నారట. అయితే.. ఈ ప్రతిపాదనను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ తో పొత్తు ప్రసక్తే ఉండదని తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ వివాదం కారణంగానే మాణిక్యం ఠాకూర్ కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. అయితే, బీజేపీ బద్ధవ్యతిరేకిగా పేరున్న మాణిక్‌ రావు థాకరే ఇప్పుడు తెలంగాణ ఇంచార్జిగా వచ్చారు. మరి ఈయన ఎంతవరకు ఈ సమస్యకు చెక్ పెడతారో.. సీనియర్లను జూనియర్లను ఎంతవరకు ఒక్కటి చేస్తారో చూడాలి.