Nara Lokesh: కడప పర్యటనకు లోకేష్.. మరో రెండు రోజులలో పాదయాత్ర ప్రారంభం!

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ 25వ తేదీ బుధవారం కడపకు రానున్నారు. యువగళం పేరుతో ఈ నెల 27 నుంచి లోకేశ్ కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ముందుగా కడపకు వచ్చి అమీన్‌పీర్ దర్గా, మరియాపురం చర్చిలలో లోకేశ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ నుండి తిరుమలకి వెళ్లి 26న వేంకటేశ్వరుని దర్శనం చేసుకొని అదే రోజు కుప్పం వెళ్లనున్నారు. ఆ తర్వాత రోజు 27న పాదయాత్ర మొదలు పెట్టనున్నారు.
లోకేష్ ముందుగా హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బుధవారం 3.30కు బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు 4.30గంటలకు చేరుకోనున్నారు. 4.45కు అక్కడి నుండి రోడ్డు మార్గాన బయల్దేరి 5.15కు కడపలోని అమీన్‌పీర్ దర్గాకు వస్తారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. దర్గాలో 30 నిమిషాల పాటు ఉంటారు. అనంతరం 5.40కు దర్గా నుంచి బయల్దేరి 6 గంటలకు మరియాపురంలోని రోమన్ కేథలిక్ కేథడ్రిల్ చర్చి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
అనంతరం అక్కడి నుంచి 6.30కు బయల్దేరి రోడ్డుమార్గాన తిరుమలకు వెళతారు. 26 గురువారం రోజున లోకేష్ తిరుమల వెంకన్నను దర్శించుకొని అదే రోజు కుప్పం బయల్దేరి వెళ్తారు. ఆ తర్వాత రోజు శుక్రవారం లోకేష్ పాదయాత్ర యువగళం మొదలు పెట్టనున్నారు. మొత్తం 400 రోజులు 4000 కిమీ ఈ పాదయాత్ర పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎక్కడిక్కడ కార్యకర్తలు, నేతలు లోకేష్ యాత్ర కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ పాదయాత్ర అనుమతిపై సస్పెన్స్ నెలకొనగా ఫైనల్ గా లైన్ క్లియర్ అయింది. తాజాగా ప్రభుత్వం పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని నారా లోకేష్, టీడీపీ క్యాడర్ కు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ సూచించారు. పాదయాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదన్నారు. లోకేష్ పాదయాత్రను ఆపాలనే ఉద్దేశ్యం తమకి లేదన్న ఏపీ పోలీసులు చట్టం ప్రకారం అందరికీ ఎలా పర్మిషన్ ఇస్తామో లోకేష్ పాదయాత్రకు అలాగే ఇచ్చామని చెప్పారు. దీంతో బుధవారం నుండే లోకేష్ పర్యటనలు మొదలు కానున్నాయి.