Police Leave Letter: నా భార్య అలిగింది.. బుజ్జగించేందుకు 10 రోజులు సెలవు కావాలి.. సీఐ లీవ్ లెటర్!

Kaburulu

Kaburulu Desk

March 6, 2023 | 09:19 AM

Police Leave Letter: నా భార్య అలిగింది.. బుజ్జగించేందుకు 10 రోజులు సెలవు కావాలి.. సీఐ లీవ్ లెటర్!

Police Leave Letter: అప్పుడప్పుడు మనం వింతైన లవ్ లెటర్స్ చూస్తుంటాం. స్కూల్ లో పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఏదొక దొంగ కారణాలు చూపి డుమ్మా కొట్టడం సహజమే. ఆ మధ్య బీహార్ లో టీచర్స్ రాసిన లవ్ లెటర్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. తన తల్లి చనిపోబోతోందని, అంత్యక్రియల కోసం పలానా రోజుల్లో సెలవులు కావాలని ఒకరు, త్వరలోనే తన ఆరోగ్యం పాడవబోతోందని, కాబట్టి సెలవులు కావాలని మరొకరు, నేనో పెళ్లికి వెళ్తున్నా.. అక్కడ ఏది పడితే అది తినేస్తే కడుపు నొప్పి వస్తుంది కాబట్టి సెలవు కావాలని ఉపాధ్యాయులు రాసిన సెలవు చీటీలు గతేడాది నవ్వు తెప్పించాయి.

కాగా, ఈ ఏడాది అంతకు మించి నవ్వి తెప్పించేలా ఉంది సర్కిల్ ఇన్స్పెక్టర్ రాసిన ఓ లీవ్ లెటర్. హొలీ జరుపుకునేందుకు పుట్టింటికి తీసుకెళ్లనందుకు తన భార్య అలిగిందని, ఇప్పుడు ఆమెని బుజ్జగించి తీసుకొచ్చేందుకు 10 రోజుల సెలవు కావాలని ఎస్పీకి పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాసిన లీవ్ లెటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌కు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాసిన సెలవు చీటీలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.

పోలీస్ శాఖలో సెలవులు దొరక్క పోవడంతో గత 22 ఏళ్లుగా తన భార్యను పుట్టింటికి తీసుకెళ్లలేకపోయానని ఇన్‌స్పెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి తనతో కలిసి పుట్టింటికి వెళ్లాలని కోరుకుంటోందని, కాబట్టి తనకు సెలవులు తప్పనిసరిగా అవసరమని పేర్కొన్నారు. తన సమస్యను పరిగణనలోకి తీసుకుని పది రోజులు సెలవు మంజూరు చేయాలని కోరారు. ఈ లీవ్ లెటర్ చదివిన ఎస్పీ అశోక్ కుమార్ మీనా నవ్వు ఆపుకోలేకపోయారట. అయితే, ఇన్‌స్పెక్టర్ కోరినట్టు పది రోజులు కాకుండా ఐదు రోజుల సెలవులు కూడా మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఈ లీవ్ లెటర్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.