Kotamreddy Sridhar Reddy: నా ఫోన్ ట్యాప్ చేసున్నారు.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Kaburulu

Kaburulu Desk

January 29, 2023 | 12:03 PM

Kotamreddy Sridhar Reddy: నా ఫోన్ ట్యాప్ చేసున్నారు.. కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Kotamreddy Sridhar Reddy: ఏపీలో ఇంకా ఎన్నికలకు ఒకటిన్నర ఏడాది ఉండగానే ఇప్పటికే ఇక్కడ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీలో అంతర్గత పోరు కూడా తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా అధికార వైసీపీ వర్గ పోరులో నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. కొందరు ఏకంగా అధిష్టానంపైనే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీలో ఇప్పుడు వర్గ పోరుతో పార్టీ ఇబ్బందులు పెడుతుంది. ఇప్పటికే ఆనం రాంనారాయణరెడ్డి వ్యవహారం ఇక్కడ కాకరేపుతుంటే.. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో పేరున్న కోటంరెడ్డి ఇప్పుడు అదే వ్యాఖ్యలను ప్రభుత్వంపైనా, సొంత పార్టీ నేతలపైనా చేస్తున్నారు.

తనను రాజకీయంగా ఎదగనీయకుండా జిల్లాలోని పెద్ద రాజకీయ కుటుంబాలు అడ్డుకున్నాయని ఆమధ్య పరోక్షంగా ఆనం, మేకపాటి కుటుంబాలపై విమర్శలు గుప్పించిన కోటంరెడ్డి.. తాజాగా నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్నారని.. తన మీద, తన కదలికల మీద నిఘా పెట్టారని బాంబ్ పేల్చారు. తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్న విషయం తనకు ముందే తెలుసని కూడా కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.

ఫోన్ టాప్ చేస్తున్నారనే.. ఆ ఫోన్లో ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతున్నానని.. రహస్యాలు మాట్లాడుకునేందుకు తన వద్ద వేరే ఫోన్ ఉందని, చాలా సిమ్ కార్డులు కూడా ఉన్నాయని.. చేతనైతే వీటిని కూడా ట్యాప్ చేయండని, అవసరమైతే ఇందుకోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించుకోండని సవాల్ విసిరించారు. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తనకు బాగా తెలుసని పేర్కొన్న కోటంరెడ్డి.. తనవాళ్ల కోసం ఎవరితోనైనా ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని.. ప్రజా సమస్యల కోసం జైలు కూడా తనకి కొత్తేమీ కాదన్నారు.