Tamilanadu: హతవిధి.. కుక్కని కుక్క అని పిలిచాడని.. వృద్ధుడిని కొట్టి చంపేసిన బంధువులు!

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 01:18 PM

Tamilanadu: హతవిధి.. కుక్కని కుక్క అని పిలిచాడని.. వృద్ధుడిని కొట్టి చంపేసిన బంధువులు!

Tamilanadu: ఈ మధ్య కాలంలో కొంతమంది మనుషులకన్నా కుక్కలనే ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇంట్లో తల్లి, దండ్రులను ప్రేమగా చూడలేరు కానీ.. కుక్కలని, పిల్లులను మాత్రం బుజ్జీ, కన్నా అంటూ గారాబం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు మన సమాజంలో. వీళ్ళు వాళ్ళ పెట్స్ ని ఎలా పడితే అలా పిలిచినా ఒప్పుకోరు. కుక్కని కుక్క అని పిలిచినా వాళ్లకి కోపం వచ్చేస్తుంది. అలా కోపం వచ్చి కుక్కని కుక్క అని పిలిచిన పాపానికి వృద్ధుడిని కొట్టి చంపేశారు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిందీ ఘటన.

దిండిగల్ జిల్లాలో తడికొంబు పోలీసు స్టేషన్ పరిధిలోని ఉలగంపట్టియార్‌కొట్టం ప్రాంతంలో నివాసం ఉంటున్న రాయప్పన్ అనే వృద్ధుడికి, అతడి పొరుగింట్లో నివాసం ఉంటున్న నిర్మలా ఫాతిమా రాణి, ఆమె ఇద్దరు కుమారులైన డానియెల్, విన్సెంట్ కి మధ్య తరచుగా ఓ వివాదం నడుస్తోంది. డానియెల్, విన్సెంట్ ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటుండగా.. రాయప్పన్ దానిని కుక్క అని పిలుస్తున్నాడు. వాళ్ళు అలా పిలవొద్దని పేరు పెట్టి పిలవాలని హెచ్చరించే వాళ్ళు.

ఒకరోజు ఇంటి దగ్గరలోని తమ పొలంలో బోరు స్విచ్ ఆఫ్ చేయమని రాయప్పన్ తన మనవడు కెల్విన్‌‌కు చెప్పారు. అలాగే పొరుగింటి వారి కుక్క బయట ఉందేమో జాగ్రత్త కర్ర తీసుకెళ్లు అని మనవడిని హెచ్చరించాడు. అది విన్న పొరుగింటి వ్యక్తి డానియల్ కోపంతో రాయప్పన్ దగ్గరకు వచ్చి గొడవపడ్డాడు. దీంతో రాయప్పన్ మీ కుక్కని ఇంట్లో కట్టేసుకోవాలని.. బయటకి వదిలితే అవి మాపై దాడి చేస్తాయని భయంగా ఉందని డేనియల్ కి వివరించబోయాడు.

దీనికి మళ్ళీ కుక్క అంటావా అని డేనియల్.. రాయప్పన్ ఛాతీపై కొట్టాడు. ఎన్నిసార్లు చెప్పాలి కుక్క అని పిలవొద్దని అంటూ అదే పనిగా అతడిపై పిడిగుద్దులు గుద్దాడు. దాంతో రాయప్పన్ కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో భయపడిపోయిన డేనియల్ కుటుంబం అక్కడి నుంచి పారిపోయింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు డేనియల్ కుటుంబాన్ని వెతికి మరీ పట్టుకుని అరెస్ట్ చేశారు.