Jagtial district: కోడిపై మర్డర్ కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు.. త్వరలో కోర్టులో హాజరు!

Kaburulu

Kaburulu Desk

March 3, 2023 | 01:08 PM

Jagtial district: కోడిపై మర్డర్ కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు.. త్వరలో కోర్టులో హాజరు!

Jagtial district: అప్పుడప్పుడు పోలీసులు పెట్టే కొన్ని కేసులు అయ్యో పాపం అనిపిస్తే.. మరికొన్ని సార్లు వీళ్ళు పెట్టే కేసులు కామెడీగా అనిపిస్తాయి. ఒక్కోసారి కొందరు ప్రజలు కూడా సిల్లీ కారణాలతో పోలీసులకు ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఈ మధ్యనే బీహార్ లో ఒక మహిళ తన కోడి కాలు విరగ్గొట్టారని పోలీసులకు పక్కింటి వారిపై ఫిర్యాదు చేస్తే.. ఆ మధ్య తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తన పొరుగింటి వ్యక్తి తన కోడిని హతమార్చాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కాగా, ఇప్పుడు ఏకంగా పోలీసులే ఒక కోడిపై మర్డర్ కేసు బుక్ చేసిన ఘటన ఒకటి హాట్ టాపిక్ అవుతుంది. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్ కు చెందిన సత్తయ్య (45) ఓ కోడిని పెంచుతున్నాడు. కాగా, మూడు రోజుల కిందట జరిగిన కోళ్ళ పందెంలో దానిని బరిలోకి దింపాడు. అందరిలా ఆ కోడి కాలికి కత్తి కట్టాడు. కానీ, అది పొరపాటున ఎగిరేసరికి ఆ కత్తి సత్తయ్య పొట్టలోనే గుచ్చుకొని అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సత్తయ్య మృతికి కోడే కారణమని తేల్చారు.

ఫైనల్ గా ఆ కోడినే ఏ-వన్ ముద్దాయిగా చేర్చి దానిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. త్వరలోనే దానిని కోర్టులో కూడా ప్రవేశపెట్టనుట్టన్నారట. ఈ కోడి కత్తి కేసు కూడా ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన కోడికత్తి కేసు రేంజిలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు రకరకాల ఫన్నీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

సాధారణంగా పోలీసులు కేసు నమోదు చేసేప్పుడు నిందితుడు పేరు, వివరాలు నమోదు చేస్తారు కదా. మరి కోడిపై కేసులో వివరాలు ఎలా రాశారబ్బా అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. ఎఫ్ఐఆర్ లో కోడి పేరు ‘కొక్క రొక్కో’ అని రాసి ఉంటారని.. దాని తండ్రి పేరు కూడా సన్ అప్ ‘కొక్క రొక్కో 2’ అని రాసి ఉంటారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక, రేపు కోర్టు విచారణలో కోడి తరపున లాయర్ ఉంటారా? ఉంటే లాయర్ కోర్ట్ లో ఎలా వాదిస్తారు? ఒకవేళ కోడికి ఉరిశిక్ష వేస్తారా? అబ్బో ఇలా ఎన్నో అనుమానాలు నెటిజన్ల సొంతం!