Gadikota Srikanth Reddy: విజయమ్మే మాకు పెద్ద దిక్కు.. అవినాష్‌కు వైసీపీ ఫుల్ సపోర్ట్!

Kaburulu

Kaburulu Desk

January 28, 2023 | 07:27 PM

Gadikota Srikanth Reddy: విజయమ్మే మాకు పెద్ద దిక్కు.. అవినాష్‌కు వైసీపీ ఫుల్ సపోర్ట్!

Gadikota Srikanth Reddy: విజయమ్మే మా అందరికీ పెద్ద దిక్కు.. ఆమె దగ్గరికి వెళ్లి అవినాష్ ఆశీర్వాదం తీసుకుంటే తప్పేంటని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి.. అవినాష్ రెడ్డి విజయమ్మను కలిసినా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. హత్య ఎవరు చేశారు.. ఎందుకు చేశారో ఇప్పటికే తేలిపోయిందని ఆయన అన్నారు.

అవినాష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని కావాలనే కుట్ర పన్నారని ఆరోపించిన శ్రీకాంత్ రెడ్డి.. అవినాష్ విచారణ పారదర్శకంగా జరగాలని.. ఆయనకు పార్టీ పూర్తిగా అండగా వుంటుందని స్పష్టం చేశారు. విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని.. ఆయన విచారణ ద్వారా ప్రజలకు నిజాలు తెలిసే అవకాశాలు వున్నాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మాదిరిగా జగన్ సీబీఐ రాష్ట్రంలోకి రావొద్దని అనలేదన్నారు.

కాగా, హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలో అవినాష్ విచారణ కొనసాగుతోంది. వివేకా హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారన్న అంశాలపై అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అవినాష్ అనుచరులతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకుని ఎదురుచూస్తున్నారు. అయితే విచారణకు ముందు తన విచారణ వీడియో రికార్డింగ్ చేయడంతో పాటు తన తరపు న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని అవినాష్ సీబీఐ అధికారులను కోరారు.

కానీ, సీబీఐ అధికారులు లేఖను పట్టించుకోలేదు. విచారణ జరుగుతున్న గదిలోకి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులను, అధికారులు అనుమతించలేదు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉండగా.. గంటల తరబడి విచారణ సాగుతుండడంతో వైసీపీ నేతలతో పాటు వైఎస్ ఫ్యామిలీ అనుచరులు ఏం జరగబోతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.