Minister Puvvada: బండి సంజయ్ కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుంది!

Kaburulu

Kaburulu Desk

January 20, 2023 | 12:51 PM

Minister Puvvada: బండి సంజయ్ కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుంది!

Minister Puvvada: ఖమ్మం సభతో గులాబీ బాస్ జాతీయ రాజకీయాలకి సమర శంఖారావం ఊదేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు ముఖ్యమంత్రులను, జాతీయ స్థాయి నేతలను సభకి రప్పించి ఇదీ మా స్థాయి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఖమ్మం సభ నుండే ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మాటల దాడి చేసి ఏకిపారేశారు. ఉచిత కరెంట్ ఇచ్చాం.. వ్యవసాయానికి పెద్దపీట వేశాం.. మా సంక్షేమం దేశంలోనే మరెక్కడా లేదని నొక్కి వక్కాణించారు.

కనీవినీ ఎరుగని స్థాయిలో బీఆర్ఎస్ ఖమ్మం సభకి ఏర్పాట్లు చేయగా.. జనసమీకరణ కూడా అదే స్థాయిలో చేసి సభను సక్సెస్ చేశారు. సభలో మాటల తూటాలు పేలితే.. బీఆర్ఎస్ నేతల విమర్శలకు బీజేపీ ఎదురు కౌంటర్లు వేసింది. కేసీఆర్ పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ ఇవన్నీ ఏంటీ అంటూ తూర్పారా పట్టే ప్రయత్నం చేశారు. దీనికి మళ్ళీ బీఆర్ఎస్ నేతల ఎదురుదాడి మొదలు పెట్టారు.

ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ సభ విఫలం అయిందన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిందని, వాస్తవాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు దిగుతున్నాయని దుయ్యబట్టారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా చేయడం లేదన్న బండి సంజయ్‌ వ్యాఖ్యలకు.. 24 గంటలు కరెంటు వస్తుందో లేదో తెలుసుకునేందుకు సంజయ్ ఏదో ఒక సమయంలో కరెంటు తీగలు పట్టుకొని చెక్‌ చేసుకోవాలంటూ పువ్వాడ ఎద్దేవా చేశారు.

అంతేకాదు, ఖమ్మం సభ విఫలం అయిందంటున్న వారికి తమ కంటి వెలుగు పథకంలో భాగంగా కళ్లద్దాలు ఇస్తామని సెటైర్లు వేశారు. కళ్లద్దాలు పెట్టుకుని చూస్తేనైనా నిజాలు కనబడతాయని పువ్వాడ విమర్శించారు. విద్యుత్తు రంగాన్ని, పంపిణీ సంస్థలను గౌతమ్ అదానీకి కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించిన మంత్రి.. సంస్కరణల పేరుతో అన్నదాతలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని, ఈ కుట్రల నుంచి కాపాడుకునేందుకు విద్యుత్‌ ఉద్యోగులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.