YSRCP-Janasena: నువ్వో బచ్చావని హరిరామజోగయ్య లేఖ.. పవన్ కి రాయబోయి నాకు రాశావన్న అమర్నాథ్

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 07:06 PM

YSRCP-Janasena: నువ్వో బచ్చావని హరిరామజోగయ్య లేఖ.. పవన్ కి రాయబోయి నాకు రాశావన్న అమర్నాథ్

YSRCP-Janasena: ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఏపీలో రాజకీయాలు మాత్రం రేపే ఎన్నికలు అన్నట్లుగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు టీడీపీ, వైసీపీ మధ్య ప్రత్యక్ష మాటల దాడి జరుగుతుంటే.. మరోవైపు వైసీపీ-జనసేన మధ్య లేఖల యుద్ధం నడుస్తుంది. ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య మధ్య లెటర్‌ వార్‌ జరుగుతోంది. లేఖలతోనే ఈ ఇద్దరూ పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తున్నారు.

అమర్నాథ్‌పై కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తీవ్రస్థాయిలో మండిపడుతూ ఆదివారం లేఖ రాశారు. ‘‘డియర్ అమర్‌నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి.. పైకి రావాల్సిన వాడివి.. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తుని పాడు చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్‌పై బురద చల్లడానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా.’’ అని హరిరామజోగయ్య పేర్కొన్నారు.

హరిరామ జోగయ్య లేఖపై స్పందించిన మంత్రి అమర్నాథ్.. లేఖకి సమాధానం ఇచ్చారు. ”పవన్ కళ్యాణ్ కి చెప్పాల్సినవి నాకు చెబుతున్నారు. కాపుల విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్ కు రాయవలసిన, చెప్పవలసిన విషయాలు పొరపాటున నాకు రాశారు. మీకు ఆయురారోగ్యాలతో పాటు మీరు మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని అమర్నాథ్ లేఖలో పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్‌ను ‘కాపు’ కులంతో ముడిపెడుతూ అమర్నాథ్ ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పవన్ కళ్యాణ్ కాపులను తాకట్టుపెడుతున్నారని దుయ్యబడుతుంటారు. ఈ క్రమంలో మంత్రి అమర్నాథ్‌పై జనసేన నాయకులు, కార్యకర్తలు, కాపు సంఘం నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే కాపు సంఘం నాయకుడు హరిరామజోగయ్య కూడా విరుచుకుపడుతూ అమర్నాథ్ కు లేఖ రాయగా.. అమర్నాథ్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. మొత్తం విమర్శ, ప్రతి విమర్శలు.. లేఖలు.. ఎదురుదాడి లేఖలు అన్నట్లుగా ఉంది పరిస్థితి.