Chiranjeevi: మెల్లగా ఓపెన్ అవుతున్న మెగాస్టార్.. ఇక మిగిలింది జై జనసేన నినాదమే?

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 10:14 PM

Chiranjeevi: మెల్లగా ఓపెన్ అవుతున్న మెగాస్టార్.. ఇక మిగిలింది జై జనసేన నినాదమే?

Chiranjeevi: ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం, కాంగ్రెస్ లో విలీనం.. మంత్రి పదవి గడువు తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై ఎక్కడా అంతగా యాక్టివ్ లేరు. పలు రాజకీయ కార్యక్రమాలు.. నేతలను కలిసినా అదంతా మర్యాదపూర్వకమే కానీ.. రాజకీయాల గురించి కానేకాదని చెప్పేవారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినా.. అన్నయ్య చిరు మాత్రం స్పందించలేదు. మరో తమ్ముడు నాగబాబు పవన్ కు తోడుగా పార్టీలో చేరారు కానీ.. అన్నయ్య మాత్రం ఏదో తన ప్రయత్నం చేస్తున్నాడులే అన్నారు తప్ప పెద్దగా స్పందన లేదు.

కానీ.. ఈ మధ్య కాలంలో మెల్లగా మెగాస్టార్ కూడా ఓపెన్ అవుతున్నారా అనే భావన కలుగుతుంది. తమ్ముడు కళ్యాణ్ బాబుకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుందని ఆ మధ్య ప్రకటించిన చిరంజీవి.. ఇప్పుడిప్పుడే జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కష్టాన్ని నమ్ముకున్నాడని ఏదో ఒకరోజు అనుకున్నది సాధిస్తాడని కాంప్లిమెంట్లు కూడా ఇస్తున్నారు. ఇక.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ పై ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలపై కూడా స్పందిస్తున్నారు.

తాజాగా చిరు పవన్ పై విమర్శల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు మితిమీరి పవన్‌ను అనరాని మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుందన్న చిరంజీవి.. పవన్‌ను తిట్టినవాళ్లు మళ్లీ తన దగ్గరకు వచ్చి పెళ్లిళ్లకు, పేరంటాలకు పిలుస్తారని అన్నారు. తన తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్లతో మళ్లీ మాట్లాడాల్సి వస్తోందనే బాధ తనకు ఉందని సంచలన వ్యాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ కు స్వార్థం లేదని.. డబ్బు యావ లేదని.. పదవీ కాంక్ష లేదని అలాంటి తనని వీళ్ళు ఇన్నేసి మాటలు అంటుంటే బాధగా ఉంటుందన్నారు.

చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు అధికార పార్టీ వైసీపీ నేతలను ఉద్దేశించేనని రాజకీయ వర్గాలలో స్పష్టమైన అంశం. వైసీపీలో ఉండే పవన్ సన్నిహితంగా ఉండేవాళ్ళను ఉద్దేశించే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతుండగా.. అసలు చిరంజీవి ఇప్పుడు ఇలా ఎందుకు ఓపెన్ అవుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాలలో విమర్శలు సహజం.. అయితే ఇప్పుడు రాజకీయాలలో ఈ విమర్శలు కాస్త వ్యక్తిగతంగా మారడం బాధాకరమే. అయితే.. ఇవన్నీ చిరంజీవి ప్రజారాజ్యం సమయంలోనే చూసేశారు. కానీ ఇప్పుడు ఇలా మళ్ళీ ప్రస్తావించడం వెనక బలమైన అర్ధమే ఉందంటున్నారు పరిశీలకులు. చిరంజీవి ఇలా పదేపదే తమ్ముడిని ప్రస్తావిస్తూ తనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా అభిమానులకు సంకేతాలిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఇప్పుడే ఇలా ఉన్న చిరంజీవి ఎన్నికల సమయానికి జై జనసేన నినాదాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.