Pregnant Woman Raped: గర్భిణీపై మృగాడు అత్యాచారం.. వీడియో తీసిన అతని భార్య.. ఆపై బెదిరింపులు!

Pregnant Woman Raped: మన సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు కుంచించుకుపోతున్నాయి. మంచి, చెడు, విచక్షణ, పాపం పుణ్యం అనేవి కొందరిలో కనీసం చూద్దామన్నా కనిపించడం లేదు. చట్టాలు, న్యాయాలు అనేది పక్కన పెట్టినా కనీసం సాటి మనిషిగా కూడా ఆలోచించలేని రోగులు మన సమాజంలో పెరిగిపోతున్నారు. అందుకే కొన్ని ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందోనన్న ఆశ్చర్యం కలిగించకమానదు.
ఒక్కోసారి ఒక్కో గురించి తెలుస్తుంటే బాధ, భయం, కోపం వస్తుంటాయి. అటువంటి ఘటనే ఇది. ఓ నిండు చూలాలిపై బంధువు ఒకడు అత్యాచారానికి ఒడిగట్టాడు. సాటి మహిళ, అందునా ఆశా కార్యకర్త అయిన అతని భార్య ఆ మృగానికి సహకరించడం శోచనీయం. అంతేకాకుండా ఆ దృశ్యాన్ని వీడియోలు తీసిన భార్య బెదిరించడం కూడా చేశారు. దీంతో మానసిక సంఘర్షణకు లోనైన గర్భిణీ ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. నబరంగ్‌పూర్ జిల్లాలో ఖతీగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో లిలియా రుంజికర్, పద్మ రుంజికర్ అనే భార్యా భర్తలైన ఇద్దరు ఉన్నారు. వరుసకు మరదలైన గర్భిణీపై లిలియా మోజు పడ్డాడు. అయితే, ఆమె అప్పటికే గర్భిణీ. అయినా కనికరించని ఆ మృగం భార్యతో కలిసి పన్నాగం వేశాడు. భార్య పద్మ రుంజికర్ ఆశా వర్కర్ కాగా.. గత నెల 28న ఆరోగ్య పరీక్షల నిమిత్తం బాధిత మహిళను నబరంగ్‌పూర్‌లోని పఠానా సాహిలోని ఓ ఇంటికి పిలిపించింది.
ఇవేమీ తెలియని బాధిత మహిళ.. రెగ్యులర్ చెకప్‌లో భాగమే అనుకోని అక్కడికి వెళ్లింది. అప్పటికే అక్కడే ఉన్న పద్మ భర్త గర్భిణీపై అత్యాచారం చేయగా.. భార్య పద్మ వీడియో తీసింది. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తామంటూ ఇద్దరూ బెదిరించారు. అయితే, బాధితురాలు ఆ మోసాన్ని, తనపై జరిగిన దాడిని జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను రక్షించిన కుటుంబ సభ్యులు మెల్లగా కూపీ లాగడంతో విషయం బయటపడింది. బాధితురాలి కుటుంబం ఖతీగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడు లిలియా, అతని భార్య పద్మలను పోలీసులు అరెస్టు చేశారు.