BRS Party: సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నేతలు.. బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు?

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 10:05 PM

BRS Party: సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నేతలు.. బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు?

BRS Party: అనుకున్నట్లే బీఆర్ఎస్ విస్తరణలో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. రేపు మహారాష్ట్ర నాందేడ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన కేసీఆర్.. మిగతా రాష్ట్రాలలో కూడా చేరికలను ప్రోత్సహిస్తున్నారు. బీఆర్ఎస్​లో చేరేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రేపు మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

ముందుగా తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. అందులో భాగంగా వివిధ పార్టీల్లో ఉండే నేతలను ఆహ్వానిస్తున్నారు. దీంతో పలువురు బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను హైదరాబాద్ ప్రగతి భవన్ లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ కు చెందిన పలువురు నేతలు కలిశారు.

ఛత్తీస్‌గఢ్ కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్​లోని బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, ఛత్తీస్‌గడ్‌ మాజీ మంత్రి చబ్బీలాల్ రాత్రే, గడ్చిరోలి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పసుల సమ్మయ్య, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

బీఆర్‌ఎస్ పార్టీ విధి విధానాల గురించి అధినేతతో సుదీర్ఘంగా చర్చించిన ఈ నేతలంతా.. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్లు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి ఇతర కార్యక్రమాలపై ఆకర్షితులైనట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని ఆహ్వానించిన నాయకులు.. దేశంలో కేసీఆర్ వంటి ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం అవసరం ఉందని పేర్కొన్నారు.